బన్సీలాల్‌పేటలో ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలు
సాక్షి, హైదరాబాద్/లింగోజిగూడ, బన్సీలాల్ పేట (హైదరాబాద్): కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం శనివారం బయట పడిందని, ఆ రెండు పార్టీలూ ఒకటే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ఆయన మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా ఉందని చెప్పారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు ఇష్టం లేదని, అయితే ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత మధ్యవర్తిత్వం వహిస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ హైకమాండ్‌తో టచ్‌లో ఉన్నారని, అందుకే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత ఈ మధ్య టీఆర్‌ఎస్‌కు పార్లమెంటులో మద్దతు ఇచ్చారని చెప్పారు. తాజాగా కేసీఆర్ స్వయంగా కాంగ్రెస్‌ను పొగిడారని, చీకటి ఒప్పందాన్ని నిన్న బయట పెట్టారని పేర్కొన్నారు. గతంలోనూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి పోటీ చేశాయని, ఈసారీ కలిసి పోటీ చేయనున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని గుర్తుచేశారు. కేసీఆర్ పులి అని చెప్పుకుంటుంటే పులులు బాధపడుతున్నాయని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌ను ఏం చేయాలో ప్రజలే చెప్పాలి
తాగి బండి నడిపితే ఫైన్ వేస్తున్నప్పుడు రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్‌ను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలని సంజయ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. బీజేపీ బడుగు, బలహీన వర్గాల పక్షపాతి అని చెప్పారు. బీసీలకు న్యాయం జరగాలని జాతీయ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
బీసీ, ఎస్సీ ఎస్టీలకు అందుతున్న రిజర్వేషన్లు అందకుండా చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారని సంజయ్ విమర్శించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. కాగా, రాజ్యాం గాన్ని మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బన్సీలాల్‌పేట డివిజన్ చాచా నెహ్రూనగర్‌లో నిరసన చేపట్టిన బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేయడాన్ని సంజయ్ ఖండించా రు. కేసీఆర్ అమలు చేయాలనుకుంటున్న కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అడ్డుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment