ప్రీతిది లవ్‌ జిహాదీ కేసే  | Bandi Sanjay Says Warangal PG Medico Suicide Attempt Due To Love Jihad | Sakshi
Sakshi News home page

ప్రీతిది లవ్‌ జిహాదీ కేసే 

Published Sat, Feb 25 2023 1:12 AM | Last Updated on Sat, Feb 25 2023 5:09 PM

Bandi Sanjay Says Warangal PG Medico Suicide Attempt Due To Love Jihad - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న బండి సంజయ్‌కుమార్‌   

కరీంనగర్‌టౌన్‌: వరంగల్‌ మెడికల్‌ స్టూడెంట్‌ ప్రీతిది ముమ్మాటికీ ‘లవ్‌ జిహాదీ’కేసేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. అమ్మాయిలను టార్గెట్‌ చేసి మరీ వేధింపులకు గురిచేస్తున్నారని, అందుకోసం విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులొస్తున్నాయని ఆరోపించారు. తక్షణమే ప్రీతి ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.

వరంగల్‌లో మెడికల్‌ విద్యార్థిని ప్రీతిని ర్యాగింగ్‌ చేయడంవల్లే ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, విద్యార్థి సంఘాల ఆందోళనను చల్లబర్చడానికి మెరుగైన వైద్యం పేరుతో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సార్లు అమ్మాయిని వేధింపులకు గురిచేశారని ప్రీతి తండ్రే చెప్పారని తెలిపారు.

దీనిని చిన్న కేసుగా మార్చి నీరుగార్చే కుట్ర జరుగుతోందన్నారు. వేధింపులకు పాల్పడ్డ వారి విషయంలో ఉదారత చూపుతున్న పోలీసులు.. అమ్మాయి కుటుంబ సభ్యులపై చూపకపోవడమేంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మనిషి ప్రాణాన్ని తేలికగా తీసిపారేస్తోందని, హైదరాబాద్‌లో కుక్కల దాడిలో చిన్న పిల్లాడు చనిపోతే కుక్కలకు మటన్‌ దొరకకపోవడంవల్లే అలా చేశాయని తేలికగా చెప్పడం, ఈ రెండు విషయాల్లో ఇప్పటివరకు కేసీఆర్‌ స్పందించకపోవడం సిగ్గు చేటని అన్నారు.  

కేసీఆర్‌ది ఐరన్‌ లెగ్‌..  
‘కొండగట్టు ఆలయంలో గర్భగుడి దగ్గర దొంగతనం జరగడం సిగ్గు చేటు. కేసీఆర్‌ది ఐరన్‌ లెగ్‌. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్‌ అవుతోంది’అని సంజయ్‌ అన్నారు. ‘యాగాలు చేస్తే యాగశాల ఆహుతైంది. యాదాద్రికి పోతే వరదలొచ్చే. కొండగట్టుకు వస్తే దొంగతనం జరిగే. కొండగట్టుకు వెయ్యి కోట్లు రాకపోగా దొంగలొచ్చి దొంగతనం జరిగింది’అని ఎద్దేవా చేశారు. రేపో మాపో ఈ కేసును కూడా నీరుగారుస్తారని, మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని అని అమాయకులను ఇరికించే కుట్ర చేసే ప్రమా­దం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌ది దొంగ పూజని, ఆయన కొడుకు దేవుడినే నమ్మని నాస్తికుడు, మూర్ఖుడని అన్నారు.  

దందాలకు కేరాఫ్‌ కేసీఆర్‌ కుటుంబం 
లంగ దందా, దొంగ దందాలకు కేరాఫ్‌ కేసీఆర్‌ కుటుంబమని బండి సంజయ్‌ విమర్శించారు. ‘ఒకరిది ఇసుక దందా, ఇంకొకరిది డ్రగ్స్‌ దందా, మరొకరిది దొంగ సారా, పత్తాల దందా..’ఈ దందాలను ప్రశ్నిస్తున్నందుకే కేంద్రం తెలంగాణకు ఏమీ చేయడం లేదని అబద్దాలాడుతూ సెంటిమెంట్‌ను రగిల్చే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ఇచ్చిన హామీలతోపాటు కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై  చర్చకు సిద్ధం కావాలి’అని అన్నారు. మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి  సమావేశంలో పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement