బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను చూపుతున్నసుమిత్ర సంఘం సభ్యులు, రూ.20వేలు డిపాజిట్ చేసినట్లు ఉన్న రశీదు
వెల్దుర్తి(తూప్రాన్) : మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో పొదుపు సంఘాల సభ్యుల డబ్బుల చెల్లింపుల్లో వీవోఏలు నమ్మితే నట్టేట ముంచుడే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. మహిళా సంఘం సభ్యులు ప్రతినెలా బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బుల చెల్లింపులోనూ వీవోఏలు చేతివాటం ప్రదర్శించారు. ఈ నెల 20న విచారణ చేపట్టిన అధికారులు అక్రమాలను గుర్తించి వీవోఏ–2 మాధవి నుంచి రూ.4,65,798 రికవరీకి ఆదేశించారు.
విచారణ సమయంలో అధికారులు, మహిళలకు చిక్కకుండా గ్రామానికి చెందిన వీవోఏ–1 మానస ఏకంగా బ్యాంక్ స్టేట్‌మెంట్ రికార్డులను ఫోర్జరీ చేసినట్లు సుమిత్ర సంఘం సభ్యులు గుర్తించారు. మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించి పొదుపు సంఘం సభ్యులు రూ. 20 వేలు చొప్పున వీవోఏ మానసకు డబ్బులు అప్పగించగా బ్యాంకులో మాత్రం కేవలం రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేసింది. సభ్యులకు అనుమానం రాకుండా బ్యాంక్ వోచర్‌లో ఇరవై వేలుగా మార్చి అక్షరాల్లోనూ రాసి రశీదులను
అందజేసింది.
విచారణలో బయట పడుతుందని..
విచారణ సమయంలో తక్కువ డబ్బులు డిపాజిట్ చేసిన విషయం బయట పడుతుందనే ఉద్దేశ్యంతో బ్యాంక్ అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సైతం ఓ జిరాక్స్ సెంటర్‌లో మార్చి అటు అధికారులు, ఇటు పొదుపు సంఘాల సభ్యులను పక్కదారి పట్టించింది. మానస తీరుపై అనుమానం వచ్చిన సుమిత్ర సంఘం సభ్యులు శుక్రవారం బ్యాంక్‌లో స్టేట్‌మెంట్ తీసుకోగా అందులో రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. దీంతో గ్రామచావిడి వద్ద వీవోఏ మానసను కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రజిత ఎదుటే నిలదీశారు. రుణాల మంజూరు విషయంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమను మోసం చేసి డబ్బులు కాజేసిన విషయమై త్వరలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు పొదుపు సంఘాల సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment