శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు (ఫైల్), విద్యుత్ దీపాల వెలుతురులో కాంతులీనుతున్న రామాలయం (ఫైల్)
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవం నిర్వహణకు ముహూర్తం నిశ్చయించారు. కాగా, 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కర పట్టాభిషేకం మార్చి 31న జరగనుండగా, బ్రహ్మోత్సవాలు, పట్టాభిషేక మహోత్సవం షెడ్యూల్‌ను వైదిక కమిటీ, ఆలయ ఈవో శివాజీ సోమవారం ప్రకటించారు.
ఉగాది పర్వదినాన...
మార్చి 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, మార్చి 22 నుంచి మార్చి 31 వరకు పుష్కర పట్టాభిషేక ప్రయుక్త ద్వాదశ కుండాత్మక చతుర్వేద సహిత శ్రీరామాయణ మహాక్రతువు ఉత్సవాలను జరపనున్నారు. మార్చి 22న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పుష్కర పట్టాభిషేకం క్రతువుకు అంకురార్పణ జరగనుంది.
26న ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం, 27న గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాధివాసం, 28న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, 29న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ వాహన సేవలను జరుపుతారు. 30న శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం, శ్రీరామపునర్వసు దీక్షా ప్రారంభం, చంద్రప్రభ వాహనసేవ, 31న పుష్కర పట్టాభిషేక మహోత్సవం, శ్రీరామాయణ మహాక్రతువు పూర్ణాహుతి, రథోత్సవం ఉంటాయి. ఏప్రిల్ 5న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు సమాప్తి కానున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాల సమయాన రోజువారీ ప్రత్యేక పూజలు నిలిపివేయనున్నారు.
ఈ ఏడాది పుష్కర పట్టాభిషేకం
భద్రా చలం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంతోపాటు మరుసటి రోజే జరిగే రామయ్య పట్టాభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. రాముడికి భద్రాచలంలో ప్రతీ 60 ఏళ్లకు ఒక్కసారి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేక మహోత్సవం భద్రాచలంలో 1927, 1987ల్లో జరగగా, మళ్లీ 2047లో మాత్రమే కళ్లారా చూసేందుకు అవకాశముంది. ఇది కాకుండా ప్రతీ 12 ఏళ్లకోసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుపుతారు. 1999, 2011లో ఈ పుష్కర పట్టాభిషేకం నిర్వహించగా, ఈ ఏడాది మార్చి 31న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, వైదిక కమిటీ బాధ్యులు స్వామివారి వాహన సేవలకుగాను నూతన వాహనాలను తయారు చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment