సాక్షి హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విద్యాభ్యాసానికి, గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే అంటున్నారు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు. ఇటీవల తాము అరెస్టు చేసిన, కౌన్సెలింగ్ చేసిన వారిలో అనేక మందికి భోపాల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో పాటు లోతుగా ఆరా తీస్తున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు.
బీటెక్‌లోనే గంజాయికి అలవాటు పడి..
హష్ ఆయిల్ దందాకు సంబంధించిన వారం రోజుల వ్యవధిలో హెచ్–న్యూ అధికారులు.. దంపతులుగా చెప్పుకుంటున్న ఇద్దరిని అరెస్టు చేశారు. బోయిన్‌పల్లి కేసుకు సంబంధించి మదన్ మానేకర్, కొండపనేని మాన్సీలను కటకటాల్లోకి పంపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మాన్సీ కుటుంబం కొన్నేళ్ల క్రితం వ్యవసాయం కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ శివార్లకు వలసవెళ్లింది.
మాన్సీ విద్యాభ్యాసం కొంత మధ్యప్రదేశ్‌లో సాగింది. భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ చదివింది. అప్పట్లోనే గంజాయికి అలవాటు పడింది. నగరంలోని మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో సిటీకి వచ్చి గంజాయితో పాటు హష్ ఆయిల్ సేవించడం, దందా చేయడం మొదలెట్టింది. తన సహోద్యోగులతో పాటు స్నేహితులు, పరిచయస్తులకు గంజాయి, హష్ ఆయిల్ నింపిన సిగరెట్లు అలవాటు చేసింది.
విక్రేతగా మారి..
నల్లగొండలో పని చేస్తున్న రిజర్వ్ సబ్–ఇన్‌స్పెక్టర్ కుమారుడు వి.లక్ష్మీపతి కొన్నాళ్లు ఇక్కడే విద్యాభ్యాసం చేశాడు. నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ కోర్సులో చేర్పించినా... మొదటి సంవత్సరం పూర్తికాకుండానే మానేశాడు. దీంతో అతడి తండ్రి భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేర్చారు. అక్కడ ఉండగానే గంజాయికి అలవాటుపడిన ఇతగాడు ఆపై విక్రేతగా మారి హష్ ఆయిల్ దందాలోకి దిగి ఈ స్థాయికి ‘ఎదిగాడు’.
వీరిద్దరు మాత్రమే కాదు భోపాల్ లింకులతో మరికొన్ని ఉదంతాలు ఇటీవల హెచ్–న్యూ దృష్టికి వచ్చాయి. ఈ విభాగం అధికారులు మాదక ద్రవ్యాల విక్రేతలతో పాటు వినియోగదారులను పట్టుకుంటున్నారు. పదేపదే వినియోగిస్తున్న, మరికొందరికి అలవాటు చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు. ఒకటిరెండుసార్లు మాత్రమే వారికి మారే అవకాశం ఇస్తూ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు.
బయటపడుతున్న లింకులు..
గడిచిన నెల రోజులుగా ఇలా కౌన్సెలింగ్ చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల్లో అనేకమందికి భోపాల్ విద్యాభ్యాసం లింకులు బయటకు వచ్చాయి. అక్కడ చదువుతున్న రోజుల్లోనే ఈ మత్తుపదార్థాలకు అలవాటుపడ్డామంటూ వాళ్లు చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయంపై హెచ్–న్యూ ప్రత్యేక దృష్టి పెట్టింది. వివిధ మార్గాల్లో భోపాల్‌లోని విద్యాసంస్థలు, వాటిలోని విద్యార్థుల స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో నగర అధికారులకు కొన్ని కీలకాంశాలు తెలిశాయి. భోపాల్‌లో విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడి వైద్యుల వద్దకు వస్తున్న మత్తు బానిసల్లో 15 నుంచి 17 సంవత్సరాల వాళ్లూ ఉంటున్నట్లు తెలుసుకున్నారు. క్షుణ్నంగా అధ్యయనం చేయడం కోసం త్వరలో ఓ ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్ పంపాలని యోచిస్తున్నారు. ఆ తర్వాతే ఈ అంశంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు.
మాన్సీ ఫ్యామిలీ మహారాష్ట్రకు వలస వెళ్లగా.. ఆ రాష్ట్రంలోని తుల్జాపూర్ పరిసర ప్రాంతానికి చెందిన మదన్ మానేకర్ కుటుంబం బతుకుతెరువు కోసం నాచారానికి వచ్చింది. ఇతడి స్నేహితుడైన టాటూ దుకాణం నిర్వాహకుడు సోని ద్వారా మాన్సీతో పరిచయమైంది. కొ న్నాళ్లు సోనితో కలిసి ఉన్న మాన్సీ మియాపూర్‌లో నమోదైన డ్రగ్స్ కేసులో అతడు అరెస్టు కావడంతో మదన్‌తో కలిసి జీవిస్తోందని, ఇటీవల అతడిని వివాహం చేసుకున్నట్లు చెబుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
(చదవండి: ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి)
Comments
Please login to add a commentAdd a comment