సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘జన్మదినం సందర్భంగా మీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. గడిచిన కాలపు మధుర స్మృతులు నెమరువేసుకోవడంతో పాటు భవిష్యత్తు రూపురేఖలను తీర్చిదిద్దుకునేందుకు పుట్టిన రోజు ఒక ప్రత్యేకమైన సందర్భం. రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరగాలని ఆశిస్తున్నా’అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి దీవెనలతో కేసీఆర్ ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, చక్కటి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. భగవంతుడు కేసీఆర్‌కు ఆయురా రోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో చిరకాలం కొనసాగేలా దీవించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొ న్నారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, సదానంద గౌడ, అర్జున్ ముండా, రమేశ్ పోఖ్రియాల్, శ్రీపాద్ యశోనాయక్, సోం ప్రకాశ్, సంజయ్ ధోత్రే, కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, వివిధ రాష్ట్రాల సీఎంలు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, యూకే డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మాన్ తదితరులు శుభాకాం క్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తమిళనాడు డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్, ప్రముఖ నటుడు చిరంజీవి, సినీ నటులు మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తదితరులు ఉన్నారు.
హ్యాపీ బర్త్‌డే డాడీ..
‘నా జన్మదాత. నిత్య స్ఫూర్తి ప్రదాత’కు జన్మదిన శుభాకాంక్షలు అని కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘అన్ని రకాల అవరోధాలను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన పోరాట యోధుడు.. స్ఫూర్తి కలిగించే ఉద్యమకారుడు.. అద్భుతమైన పరిపాలన నాయకుడు..లివింగ్ లెజెండ్ అయిన కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తండ్రి కావడం నా అదృష్టం’అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
థాంక్యూ..
తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా, ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, పలు రంగాల ప్రముఖులకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి ప్రేమ, అభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment