నేటి నుంచి రాష్ట్రంలో 11 వేల శక్తి కేంద్రాల్లో ‘ప్రజా గోస– బీజేపీ భరోసా’ పేరిట స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లకు బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 25 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాల పరిధిలోని పోలింగ్‌బూత్‌లలో నిర్వహించనుంది.
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోని 11 వేల శక్తి కేంద్రాల్లో (3,4 పోలింగ్ బూత్‌లు కలిపి ఓ కేంద్రం) ‘ప్రజా గోస– బీజేపీ భరోసా’ పేరిట వీధి చివరి సమావేశాలకు (స్టీట్ కార్నర్) బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 25 వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌బూత్‌లలో వీటిని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్‌బోయిన్‌పల్లి చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాంఛనంగా ప్రారంభిస్తారు.
సికింద్రాబాద్‌లో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సనత్‌నగర్‌లో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, శేరిలింగంపల్లిలో మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్‌రావు, వరంగల్ పశ్చిమలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఉప్పల్‌లో ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు పాల్గొంటారు. సాయంత్రం సనత్‌నగర్ నియోజకవర్గంలోని బల్కంపేట అమ్మవారి ఆలయం వెనకవైపు నిర్వహించే కార్నర్ మీటింగ్‌కు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు.
కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన సమయం వచ్చేసింది
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఫక్తు రాజకీయాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ప్రజాగోస స్ట్రీట్‌కార్నర్ మీటింగ్స్ కోఆర్డినేటర్ డా.కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో విమర్శించారు. అన్ని రంగాల్లో విఫలమై ప్రజాసమస్యలను పరిష్కరించని కేసీఆర్ సర్కార్‌ను గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైనందున, బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు శుక్రవారం నుంచి వీధిచివర సమావేశాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment