
సాక్షి, హైదరాబాద్: సమగ్ర శిక్షా అభియాన్‌లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. ఏడాదిన్నరగా 704 పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా ఒత్తిడి తెస్తానని ఈ పోస్టుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు హామీ ఇచ్చారు.
శనివారం స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు బండి సంజయ్‌కు వినతి పత్రం అందజేశారు. సమగ్ర శిక్షా అభియాన్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఐఈఆర్పీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ ప్రోగ్రామర్ నియామకాలకు సంబంధించి 704 పోస్టులను భర్తీ చేసేందుకు 2019 జూన్ 11న నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం, డిసెంబర్ 23న పరీక్షలు నిర్వహించింది. 2020 జనవరి 7న ఫలితాలను కూడా ప్రకటించి మెరిట్ కార్డులు కూడా జారీ చేసింది. అయితే ఫలితాలు ప్రకటించి ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు నియామక పత్రాలు అందజేయలేదని అభ్యర్థులు సంజయ్‌కు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment