తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జాతీయ కమిటీలో చోటు కల్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్‌ను ఏదైనా ఒక రాష్ట్రానికి పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకురాలు డీకే అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వై.సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శిగా మరోసారి అవకాశం కల్పించారు. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ కమిటీలో కీలక మార్పులు చేశారు. మొత్తం 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 9 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఒక జాతీయ సంస్థాగత వ్యవహారాల సహ ప్రధాన కార్యదర్శి, 13 మంది జాతీయ కార్యదర్శులు, ఒక కోశాధికారి, ఒక సహ కోశాధికారితో కూడిన జాతీయ కమిటీని జేపీ నడ్డా నియమించగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్‌చార్జిగా ఉన్న సునీల్ దేవ్‌ధర్‌ను పార్టీ జాతీయ కార్యదర్శిగా తప్పించారు. కర్ణాటకకు చెందిన సీటీ రవి, అస్సాంకు చెందిన ఎంపీ దిలీప్ సైకియాలను ప్రధాన కార్యదర్శి హోదా నుంచి పక్కనబెట్టారు.
అదేవిధంగా, కార్యదర్శులుగా ఉన్న యూపీ ఎంపీలు వినోద్ సోంకార్, హరీశ్ ద్వివేదిలు కూడా పార్టీ పదవులను పోగొట్టుకున్నారు. ఇంకా, పార్టీ ఉపాధ్యక్షులుగా మైనారిటీ వర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. వీరిలో ఒకరు కేరళకు చెందిన అబ్దుల్లా కుట్టీ, మరొకరు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్, యూపీ బీజేపీ ఎమ్మెల్సీ మన్సూర్. కాగా, జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలు, ఎజెండాకు కీలకంగా ఉన్న సీటీ రవికి ఉద్వాసన పలకడం వెనుక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయమే కారణమన్న అభిప్రాయం ఉంది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీటీ రవి కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఇంకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గిరిజన నేత లతా ఉసెండీకి పార్టీ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. జాతీయ కార్యదర్శులుగా నియమితులైన 9 మందిలో ఏడుగురు పాతవారు కాగా, రాధా మోహన్ అగర్వాల్‌ను కొత్తగా తీసుకున్నారు.
►బీజేపీ జాతీయ నూతన పదాధికారుల జాబితా:
జాతీయ ఉపాధ్యక్షులు: రమణ్‌సింగ్, వసుంధరా రాజే సింధియా, రఘుబర్ దాస్, సౌదాన్ సింగ్, బైజయంత్ పాండా, సరోజ్ పాండే, రేఖా వర్మ, డీకే అరుణ, ఎం.చుబా ఎఓ, అబ్దుల్లా కుట్టీ, లక్ష్మీకాంత్ బాజ్‌పేయ్, లతా ఉసెండీ, తారిక్ మన్సూర్.
►జాతీయ ప్రధాన కార్యదర్శులు: అరుణ్ సింగ్, కైలాశ్ విజయవర్గీయ, దుష్యంత్ కుమార్ గౌతమ్, తరుణ్ ఛుగ్, వినోద్ తావడే, సునీల్ బన్సల్, బండి సంజయ్ కుమార్, రాధా మోహన్ అగర్వాల్.
►జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు): బీఎల్ సంతోష్
►జాతీయ సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు): శివప్రకాశ్
►జాతీయ కార్యదర్శులు: విజయా రాహట్కర్, సత్య కుమార్, అరవింద్ మీనన్, పంకజా ముండే, నరేంద్ర సింగ్ రైనా, అల్కా గుర్జర్, అనుపమ్ హాజ్రా, ఓం ప్రకాశ్ ధువ్రే, రుతురాజ్ సిన్హా, ఆశా లాకడా, కామాఖ్యా ప్రసాద్ తాసా, సురేంద్ర సింగ్ నాగర్, అనిల్ ఆంటోని.
►కోశాధికారి: రాజేశ్ అగర్వాల్
►సహ కోశాధికారి: నరేశ్ బన్సల్
Comments
Please login to add a commentAdd a comment