రాక్షసబల్లులు అనగానే.. మనకు గుర్తుకొచ్చేది.. జురాసిక్ పార్క్ సినిమా.. అందులోని ఫేమస్ టీ–రెక్స్ డైనోసార్.. ఇది దాన్ని మించినది.. పేరు స్పైనోసారస్. వేటాడే రాక్షసబల్లుల్లో అతి పెద్దది ఇదే. మామూలుగా ఉండదు.. 60 అడుగుల ఎత్తుతో వీపు మీద భారీ రెక్క ఒకటి తగిలించినట్లు అరివీర భయంకరంగా ఉంటుంది. జురాసిక్ పార్క్–3 సినిమాలో టీరెక్స్‌కి దీనికి ఫైట్ కూడా ఉంటుంది. ఇంతకీ విషయమేమిటంటే.. ఇంతకాలం ఇది ఎలా వేటాడుతుందన్న విషయంపై శాస్త్రవేత్తల్లో రకరకాల అంచనాలు ఉన్నాయి.. ఇప్పుడు దానిపై ఓ క్లారిటీ వచ్చింది.. అదేంటి అన్నది తెలుసుకుందామా..
– సాక్షి, సెంట్రల్ డెస్క్
ఇది నీటిలో ఈదగలదని.. నేలపైనా.. నీటిలోనా వేటాడగలదని కొందరు శాస్త్రవేత్తలు చెబితే.. కాదు కాదు.. కొంగ నీటిలోని చేపలను ఎలా పట్టుకుంటుందో.. దీని వేట కూడా అలాగే ఉంటుందని మరికొందరు అంచనా వేశారు. దీనిపై కొన్నాళ్లుగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నా యి. తాజాగా షికాగో, ఇల్లినాయి మ్యూజియాల్లోని పరిశోధకులు మొసలి, హిప్పొపొటమస్, పెంగ్విన్ లాంటి వాటితో, 2014లో బయటపడిన స్పినోసారస్ శిలాజాన్ని పోల్చిచూశారు. అధ్యయనం తర్వాత ఇది నీటిలో వేటాడగలదని తేల్చారు. ప్రొఫెసర్ మాటియో ఫాబ్రీ ఆధ్వర్యంలో ఈ పరిశోధన సాగింది.
ఈదగలదు ఇలా...: స్పినోసారస్.. ఎముకల సాంద్రత(ధృడత్వం) ఎక్కువగా ఉండటంతో ఈదుకుంటూ నీటి లోపలికి కూడా వెళ్లగలవు. మామూలుగా డైనోసార్‌లకు పొడవైన, మొసలిలాంటి దవడలు, కోన్ ఆకారపు దంతాలుంటాయి. కానీ స్పినోసారస్ సముద్ర జీవుల్లా నాసికా రంధ్రాలు, పొట్టి వెనుక కాళ్లు, తెడ్డు లాంటి పాదాలు, రెక్కలాంటి తోక ఉండటం ఈతకు సాయపడుతుంది. అయితే మారుతున్న వాతావరణం భారీ సరీసృపాల ఆహార గొలుసును నాశనం చేయడంతో ఈ డైనోసార్లు అంతరించి ఉండవచ్చని అధ్యయనం అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment