సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్‌లో బాలురు సత్తా చాటారు. టాప్–10 ర్యాంకులను సాధించిన వారిలో పది మందీ బాలురే ఉన్నారు. ఇందులో టాప్–1 ర్యాంకును రంగారెడ్డి జిల్లాకు చెందిన సాయితేజ వారణాసి కైవసం చేసుకున్నాడు. మొత్తంగా ఇంజనీరింగ్ టాప్ 10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులు పొందగా, మరో 5 ర్యాంకులను ఏపీ విద్యార్థులు సాధించారు. తెలంగాణ ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలను మంగళవారం హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్‌తో కలిసి ఫలితాలను వెల్లడించారు.
75.29 శాతం మంది అర్హులు
గత నెల 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించిన ఇంజ నీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,43,326 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,19,183 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 89,734 మంది (75.20 శాతం) విద్యార్థులు అర్హత సాధించారు. ఎంసెట్ పరీక్షలను నాలుగు రోజుల పాటు 8 విడతల్లో ఆన్‌లైన్లో నిర్వహించినందున నార్మలై జేషన్ చేసి విద్యార్థులకు మార్కులను కేటాయిం చారు. విద్యార్థులు సాధించిన ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీని కలిపి కంబైన్డ్ స్కోర్‌తో ర్యాంకులను కేటాయించారు.
117 మందికే అత్యధిక మార్కులు
ఎంసెట్‌లో అత్యధిక మార్కులు 117 మందికి లభించాయి. 160 మార్కులకు గాను 121 నుంచి 160 మధ్యలో మార్కులు సాధించిన విద్యార్థులు 117 మంది ఉన్నారు. ఇక 81 నుంచి 120 మార్కులు సాధించిన 3,409 మంది, 40 నుంచి 80 మార్కులు సాధించిన వారు 79,201 మంది ఉన్నారు. 40 కంటే తక్కువ మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 7,007 మంది ఉండగా, ఇతరులు 29,449 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు.
9 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్
ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈనెల 9 నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఈనెల 12 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించనుంది.‘అప్పుడు పాజిటివ్ వచ్చిన వారికి 8న పరీక్షలు కరోనా వైరస్ ప్రభావం వల్ల మేలో జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను వాయిదా వేసి, కరోనా ప్రభావం కొంత తగ్గాక సెప్టెంబర్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా పక్కాగా నిర్వహించగలిగామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు, కోవిడ్–19 నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించామన్నారు. గత నెలలో పరీక్షలు నిర్వహించిన సమయంలో కరోనా పాజిటివ్ ఉన్న విద్యార్థులకు ఈనెల 8న పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్ ఫలితాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
రెండ్రోజుల్లో కాలేజీలకు గుర్తింపు: నవీన్ మిట్టల్
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీని రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అనుబంధ గుర్తింపునకు సంబంధించి చేపట్టిన ప్రక్రియ ముగింపు దశకు వచ్చిందన్నారు. రెండ్రోజుల్లో ఏయే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఉంది, ఏయే కాలేజీలకు లేదు, ఏయే కాలేజీల్లో ఏయే కోర్సుల్లో ఎన్ని సీట్లున్నాయనే వివరాలను వెల్లడిస్తామన్నారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులకు ఎంసెట్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి ఈ నెల 12 నుంచి అవకాశం ఇచ్చినందున, ఆలోగానే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు సంబంధించిన జీవో వెలువడాల్సి ఉందన్నారు.
డేటా సైంటిస్టునవుతా..
మాది ఏపీలోని విజయనగరం. హైదరాబాద్‌లో ఇంటర్ చదివాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిం డియా 51వ ర్యాంక్ వచ్చింది. నాన్న విజయరామయ్య, అమ్మ శాంతకుమారి ఫిజిక్స్ టీచర్లు. వారి ప్రోత్సాహంతోనే టాప్ ర్యాంక్ సాధించా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివి డేటా సైంటిస్టు కావాలనేది నా లక్ష్యం.
– సాయితేజ వారణాసి, ఫస్ట్ ర్యాంకర్
Comments
Please login to add a commentAdd a comment