మిరుదొడ్డి (దుబ్బాక)/ సాక్షి, సిద్దిపేట: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మిరుదొడ్డి మండలం చెప్యాల కు చెందిన నిందితుడు గటాని రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలు యూట్యూబ్ చానళ్ల లో పనిచేసిన రాజు వైఖరి తొలి నుంచీ వివాదాస్పదమని.. విలేకరి ముసుగులో దందాలకు పాల్పడేవాడని స్థానికులు చెప్తున్నారు.
కలప రవాణా వాహనాలను ఆపి వసూళ్లకు పాల్పడటం, కల్లు డిపో, దుకాణాల యజమానుల నుంచి చందాలు వసూలు చేయడం వంటివి చేసేవాడని.. ఈ ఆగడాలతో సహనం నశించిన వ్యాపారులు గతంలో రాజుపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజు.. జిల్లా ముఖ్య నాయకులతో తిరిగేవాడని చెప్తున్నారు. అయితే ఎంపీపై దాడి చేసేంత పగ ఏమిటన్నది అంతుపట్టడం లేదని అంటున్నారు. అయితే.. దళితబంధు రాకపోవడం, ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో ఎంపీపై కక్షగట్టి దాడి చేసి ఉంటాడని ప్రచారం జరుగుతోంది.
అధికారులు ఇటీవల మిరుదొడ్డి మండల విలేకరులకు ఇక్కడి చెప్యాల క్రాస్‌రోడ్డులో ఇళ్ల స్థలాలు కేటాయించారు. అందులో తనకూ స్థలం కేటాయించాలని రాజు కోరగా.. ఎంపీతో చెప్పించాలని అధికారులు సూచించినట్టు తెలిసింది. రాజు పలుమార్లు ఈ విషయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. దీనికితోడు దళితబంధుకు ఎంపికైనవారి జాబితాలో తన పేరు లేకపోవడంతోనూ రాజు ఆగ్రహించాడని, ఇవన్నీ మనసులో పెట్టుకుని, దాడి చేసి ఉంటాడని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment