సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెనను ఈనెల 26వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వంతెనను ప్రారంభించనున్న నేపథ్యంలో బ్రిడ్జిపైకి 26వ తేదీ నుంచి వాహనాలను అనుమతించనున్నారు. ప్రస్తుతం అప్రోచ్ పనులు తుదిదశకు చేరుకున్నాయి.
వంతెనకు రెండువైపులా ఇటు హౌజింగ్ బోర్డును అటు సదాశివపల్లిని కలిపేలా అప్రోచ్ రోడ్ పనులు వేగంగా నడుస్తున్న క్రమంలో వంతెనపై వాహనాలు తిప్పాలని అధికారులు నిర్ణయించారు. 26 నుంచి హౌజింగ్ బోర్డు వద్ద పూర్తయిన అప్రోచ్ నుంచి వంతెనపైకి వాహనాలు నడిపించనున్నారు. అప్రోచ్ రోడ్డును కలిపే రెండు భారీ బీమ్స్ త్వరలోనే అధికారులు వంతెనకు అనుసంధానం చేయనున్నారు. దీంతో వాహనాలు వంతెనను ఎక్కేస్తాయి.
డైనమిక్ లైటింగ్ పనులు..!
వంతెనకు తుదిమెరుగులు దిద్దే కార్యక్రమం కూడా వేగవంతం నడుస్తోంది. ఇందులో భాగంగా.. వంతెనకు రాత్రిపూట మరింత అందాన్ని తెచ్చేలా డైనమిక్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు రూ.8 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ ఎల్‌ఐఈడీ లైటింగ్ సిస్టం పనులు రెండుమూడు రోజుల్లో మొదలు కానున్నాయి. రాత్రిపూట కళ్లు జిగేల్ అనిపించేలా, పర్యాటకులకు కనువిందు చేసేలా రంగురంగుల ఎల్‌ఈడీ లైట్లు వంతెనకు ఏర్పాటు చేయనున్నా రు. ఈ లైట్లు వారధికి మరింత ఆకర్షణగా నిలవనున్నాయి. నగర పర్యాటకానికి కొత్త శోభను తెచ్చేలా, చారిత్రక కరీంనగర్ పట్టణం సిగలో మరో మణిహా రంగా నిలిచిపోయే ఈ తీగల వంతెనను వచ్చే నెల తొలివారంలో ప్రారంభించేందుకు మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కర్ణన్ పట్టుదలగా ఉన్నారు. ప్రస్తుతం అప్రోచ్ రోడ్డు పనులు డైనమిక్ లైటింగ్ ప నులపై నిరంతరం సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు.
ఒకే వరుసలో నాలుగు వారధులు..!
శరవేగంగా తుదిమెరుగులు దిద్దుకుంటున్న తీగల వంతెనను ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీగల వంతెనను ప్రారంభించేందుకు జిల్లాకు రానున్నారు. అందుకే.. పట్టణ అభివృద్ధికి సాధారణ నిధులతోపాటు రూ.400 కోట్ల సీఎం అసూ్యరెన్స్ నిధులు, రూ.180 కోట్లతో తీగల వంతెన, రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను మంజూరు చేశారు. ఫిబ్రవరి నాటికి వంతెనను పూర్తిస్థాయిలో సిద్ధం చేయనున్నారు. జనవరి నెలాఖరునాటికి డైనమిక్ లైటింగ్ పూర్తవనుందని సమాచారం. ఇప్పటికే.. మానేరుపై నిర్మించిన ఎల్‌ఎండీ ఆనకట్ట, మధ్యలో రెండు వంతెనలు ఉన్నాయి. తరువాత తీగల వంతెన ప్రారంభమైతే.. కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో నాలుగు భారీ వంతెనలు ఒకే చోట ఉన్నట్లవుతుంది. ఇప్పటికే ఎల్‌ఎండీ వంతెనకు ప్రత్యేక లైటింగ్ ఉంది, ఇక మధ్య వంతెనలపై కార్పొరేషన్ లైటింగ్ సిస్టం ఉంది. తీగల వంతెన వెలుగులు వీటికి తోడైతే.. రాత్రిపూట మానేరు తీరం అంతా రంగురంగుల విద్యుత్తు కాంతులతో ఈ వారధులన్నీ ధగధగలాడనున్నాయి.
పలు దఫాల్లో లోడింగ్ టెస్టు.. తీరనున్న ట్రాఫిక్ చిక్కులు..
గతేడాది జూన్‌లో వంతెనకు లోడింగ్ టెస్టు నిర్వహించారు. 28 టిప్పర్లలో 30 టన్నుల చొప్పున ఇసుక నింపి మొత్తం 840 టన్నుల బరువును ఒకేసారి వంతెనపై వివిధ ప్రాంతాల్లో ఉంచి పరిశీలించి, ప్రతీ అంశాన్ని నోట్ చేసుకున్నారు. అలాగే, ఫుట్‌పాత్‌లపై 110 టన్నుల ఇసుక బస్తాలను ఉంచి వాటి సామర్థ్యాన్ని కూడా పరీక్షించారు. రెండో దఫాలోనూ జూలై మొదటివారంలో ఇదే బరువుతో మరోసారి వంతెన సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ అన్ని పరీక్షలను వంతెన విజయవంతంగా పూర్తి చేసుకుందని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ అతిపెద్ద ఇండస్ట్రీ. ఈ వంతెనపై నుంచి టన్నుల కొద్దీ బరువున్న గ్రానైట్ రాళ్లను కూడా తీసుకెళ్లవచ్చు.
- అదే విధంగా ట్రాఫిక్ కష్టాలకు కూడా చెక్ పడనుంది. వరంగల్– హైదరాబాద్– కరీంనగర్ నగరాలకు అలుగునూరు కూడలిగా ఉంది. ఇప్పుడు అలుగునూరు కూడలిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే.. మూడు నగరాలకు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి. ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. వరంగల్– కరీంనగర్ మధ్య రాకపోకలకు సరికొత్త మార్గంగా మారుతుంది. అదే సమయంలో ఈ రెండునగరాల మధ్య దూరం 79 కిమీలలో సుమారు 7 కి.మీలు తగ్గనుంది.
ఫిబ్రవరి నాటికి సిద్ధం: మంత్రి గంగుల కమలాకర్
తీగల వంతెన పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. పనులు తుదిదశలో ఉన్నాయి. వంతెనకు ఇప్పటికే పలుమార్లు లోడింగ్ టెస్టు కూడా పూర్తి చేశాం. ప్రస్తుతం అప్రోచ్ పనులు వేగంగా నడుస్తున్నాయి. త్వరలోనే డైనమిక్ లైటింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేయనున్నాం. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో నగర కీర్తి ప్రతిష్టలు రెండింతలు అవుతాయి. నగర పర్యాటకానికి సరికొత్త శోభ చేకూరుతుంది. వరంగల్– కరీంనగర్ నగరాల మధ్య దూరం కూడా 7 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. ఫిబ్రవరిలో సీఎం స్వయంగా ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.
వంతెన విశేషాలు ఇవే..
- 500 మీటర్ల పొడవైన రోడ్డు, నాలుగు వరుసల రహదారి..
- 26 పొడవైన స్టీల్ కేబుల్స్.. ఇటలీ నుంచి తెప్పించినవి.
- వంతెనకు 2 పైలాన్లు, రెండు పైలాన్ల మధ్య దూరం 220 మీటర్లు
- పైలాన్ నుంచి ఇంటర్ మీడియన్‌కు దూరం 110 మీటర్లు
- రూ.180 కోట్ల బడ్జెట్.. పూర్తిగా అధునాతన ఇంజినీరింగ్.
- రూ.8 కోట్లతో కొరియా డైనమిక్ లైటింగ్ సిస్టమ్
- వెడల్పు 21.5 మీటర్లు, 7 మీటర్ల వెడల్పుతో రెండు దారులు..
- రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు
- టాటా కంపెనీ సారథ్యంలో నిర్మాణం
- 2017 డిసెంబరులో శంకుస్థాపన
- 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం
- 2023 ఫిబ్రవరిలో వంతెన ప్రారంభం.
Comments
Please login to add a commentAdd a comment