సెకండ్‌ హ్యాండ్‌... భలే డిమాండ్‌! | Cars 24 Survey on Second Hand Cars And Vehicles Hyderabad | Sakshi
Sakshi News home page

సెకండ్‌ హ్యాండ్‌... భలే డిమాండ్‌!

Published Thu, Jul 30 2020 7:48 AM | Last Updated on Thu, Jul 30 2020 7:48 AM

Cars 24 Survey on Second Hand Cars And Vehicles Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ విజృంభణ... దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు... ఎక్కడిక్కడ స్తంభించిపోయిన ప్రజారవాణా... వెరసి ఎవరికి వారు వ్యక్తిగత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు రోజు వారీ ప్రయాణాలకు బస్సులు, లోకల్‌ రైళ్లు, మెట్రో, షేర్‌ క్యాబ్స్, కార్‌ పూలింగ్‌లను వినియోగించినవారు సైతం ఇప్పుడు సొంత వాహనాలు వాడుతున్నారు. ఇప్పటికే వాహనాలు ఉన్న వారు వాటిని వాడుతుండగా... లేని వారు ఖరీదు చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొత్తవి కొనుక్కోవడం ఆర్థికంగా ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలకు డిమాండ్‌ పెరిగింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన కార్స్‌ 24 సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని మెట్రో నగరాల్లో 100 మంది డీలర్లు, పది వేల మంది కస్టమర్ల అభిప్రాయాలను సేకరించి ఈ విషయం నిర్థారించింది. లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో ఎత్తివేసినా.. ఇప్పుడప్పుడే ప్రజా రవాణాను వినియోగించడానికి అత్యధికులు సిద్ధంగా లేరు.

ఫలితంగా లాక్‌డౌన్‌ ముందు కంటే ఇప్పుడు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల డిమాండ్‌ భారీగా పెరిగినట్టు ఆ సంస్థ గుర్తించింది. లాక్‌డౌన్‌కు ముందు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల మార్కెట్‌ 19 శాతం ఉండగా... లాక్‌డౌన్‌ తర్వాత అది 37 శాతానికి పెరిగింది. అలాగే కొత్త వాహనాల మార్కెట్‌ 81 శాతం నుంచి 63 శాతానికి పడిపోయింది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే బెంగళూరులో ఈ డిమాండ్‌ అధికంగా ఉంది. ఈ ఏడాది మార్చికి ముందు, ఆ తర్వాత గణాంకాల ప్రకారం ఆ నగరంలో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల మార్కెట్‌ 81 శాతం పెరిగింది. ఈ తర్వాతి స్థానంలో ఢిల్లీ (35 శాతం పెరుగుదల) ఉండగా... 10 శాతం పెరుగుదలతో హైదరాబాద్‌ నగరంలో మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని పుణేలో ఈ డిమాండ్‌ 5 శాతం పెరిగింది. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల్లోనూ ద్విచక్ర వాహనాల కంటే కార్లు వంటి తేలికపాటి వాహనాలు ఖరీదు చేయడానికి అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు బైక్స్‌ కంటే కార్లు సురక్షితం కావడంతో ఇలా చేస్తున్నారు.

మరోపక్క రోడ్లపై ప్రయాణించే సందర్భాల్లో వివిధ రకాలుగా కరోనా వైరస్‌ బారినపడకుండా ఉండటానికీ కార్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ కార్లను ఖరీదు చేసే వారిలో 45 శాతం మంది రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ధర ఉన్న వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారని కార్స్‌ 24 గుర్తించింది. ప్రధానంగా మారుతి స్విఫ్ట్, వ్యాగనార్, వోక్స్‌వ్యాగన్‌ పోలో, హుండై ఐ10, ఐ 20 బ్రాండ్లే ఎక్కువగా ఖరీదు చేస్తున్నారు. ఇన్నాళ్లు కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీ తదితర కారణాలతో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వైపు మొగ్గు చూపినవారు కూడా ఇప్పుడు సెకండ్‌ హ్యాండ్‌ కార్లు ఖరీదు చేస్తున్నారు. కేవలం సెకండ్‌ హ్యాండ్‌ కార్లు విక్రయించే షోరూమ్స్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లు వివిధ రకాలైన ఆఫర్లతో వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి. వాహన విక్రేత, ఖరీదు చేసే వ్యక్తుల మధ్య కాంటాక్ట్‌ లెస్‌ సర్వీసులు, డోర్‌స్టెప్‌ టెస్ట్‌ డ్రైవ్‌లు, ఆన్‌లైన్‌ డాక్యుమెంటేషన్, డిజిటల్‌ చెల్లింపులు, ఉచిత ఓనర్‌ షిప్‌ ట్రాన్స్‌ఫర్, కారు కండిషన్‌ పరీక్షలు, తక్కువ వడ్డీకి తేలికగా ఫైనాన్స్‌ సర్వీసులు అందిస్తూ వినియోగదారుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

వివిధ మెట్రో నగరాలకు చెందిన అనేక మంది సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల కోసం ఓఎల్‌ఎక్స్‌ వంటి ఈ–యాడ్స్‌ వెబ్‌సైట్లును ఆశ్రయిస్తున్నారు. ఉత్తరాదికి చెందిన సైబర్‌ నేరగాళ్లు దీన్ని తమకు అనువుగా మార్చుకుంటున్నారు. ప్రీ ఓన్డ్, యూజ్డ్‌ కార్లుగా పిలిచే సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఆర్మీ అధికారుల మాదిరిగా ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీటికి ఆకర్షితులై ఎవరైనా సంప్రదిస్తే... బేరసారాల తర్వాత అడ్వాన్సులు, ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీల పేరుతో అందినకాడికి తమ ఖాతాల్లో జమ చేయించుకుని మోసం చేస్తున్నారు. ఈ సైబర్‌ నేరగాళ్లు కార్లు విక్రయిస్తామంటూ ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు చేసిన వారినీ టార్గెట్‌ చేసుకుంటున్నారు. వారిని సంప్రదిస్తూ ఆయా వాహనాలను ఖరీదు చేస్తామంటూ ఎర వేస్తున్నారు. ఆపై నగదు చెలిస్తున్నామనే పేరుతో వివిధ పేమెంట్‌ యాప్స్‌కు చెందిన క్యూఆర్‌ కోడ్స్‌ పంపించి స్కానింగ్‌ చేయిస్తున్నారు. ఈ రకంగానూ టార్గెట్‌ చేసిన వ్యక్తుల ఖాతాల్లోంచి డబ్బు కాజేస్తున్నారు. ఈ తరహాకు చెందిన ఫిర్యాదులు నెలకు 100కు పైగా సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్లకు వస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement