సాక్షి, హైదరాబాద్: ఈడీ చార్జిషీట్‌లో ‘ఓటుకు కోట్లు’కుట్రకు ప్రధాన సూత్రధారి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పేరును నిందితుడిగా చేర్చకపోవడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘మనవాళ్లు అంతా బ్రీఫ్‌డ్ మీ. వారిచ్చిన హామీని నెరవేరుస్తా’నంటూ నేరుగా స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టిన చంద్రబాబును పక్కనపెట్టి.. కుట్రను అమలుచేసిన పాత్రధారులపై మాత్రమే అభియోగాలు మోపడం ఆశ్చర్యకరమని అంటున్నారు. టీడీపీ మహానాడు వేదికగా కుట్ర జరిగినట్టు బయటపడినా, స్పష్టమైన ఆడియో, వీడియో ఆధారాలున్నా కూడా చంద్రబాబును నిందితుడిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తున్నారు.
ఆ స్వరం చంద్రబాబుదే..
స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలను ప్రఖ్యాత ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) పరీక్షించింది. ఆ స్వరం చంద్రబాబుదేనని తేల్చిచెప్పింది. చంద్రబాబు చేసిన ఈ కుట్రను రేవంత్‌రెడ్డి తదితరులు అమలు చేశారనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. ఆడియో, వీడియో ఆధారాలున్నా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈడీ కూడా చంద్రబాబును నిందితుడిగా చేర్చకపోవడం సరికాదు. చట్టం దృష్టిలో అందరూ సమానమనే సందేశం ఇవ్వాలంటే చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలి.
– కొంతం గోవర్ధన్‌రెడ్డి, న్యాయవాది
చంద్రబాబే కుట్రదారు
టీడీపీ అధినేత, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే వచ్చామని రేవంత్, ఇతర నిందితులు స్టీఫెన్‌సన్‌కు చెప్పారు. అంటే ప్రధాన కుట్రదారు చంద్రబాబే. ఆయనను వదిలేసి పాత్రధారుల్ని నిందితులుగా చేర్చడం శోచనీయం. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ కుట్రను అమలు చేసినా ఈడీ ఆయనను విచారించలేదు. లంచం డబ్బును తీసుకొచ్చిన వారిని నిందితులుగా చేర్చి.. డబ్బు సమకూర్చి పంపిన చంద్రబాబును విడిచిపెట్టడం ఏమిటి? ఇప్పటికైనా చంద్రబాబును నిందితుడిగా చేరుస్తూ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయాలి.
– ఒద్యారపు రవికుమార్, న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment