సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటున్న నగరంలో మరో అద్భుతమైన కట్టడం ఆవిష్కృతం కానుంది. నిజాం కాలం నాటి చారిత్రక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో విమానాశ్రయం తరహాలో అందుబాటులోకి రానుంది. 1870లలో నిర్మించిన రైల్వే స్టేషన్ కళాత్మకతకు ఏ మాత్రం విఘాతం కలగకుండా దీని పునరభివృద్ధికి దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది.
వాస్తవానికి ఒకటిన్నర దశాబ్దం క్రితమే సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పునరభివృద్ధికి నిర్మాణ సంస్థలను ఆహా్వనించినప్పటికీ ప్రైవేట్ సంస్థలు నిరాసక్తత వ్యక్తం చేశాయి. దీంతో దక్షిణమధ్య రైల్వే స్వయంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. రానున్న 36 నెలల్లో పునరభివృద్ధి చేసేవిధంగా కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే సికింద్రాబాద్ స్టేషన్ వద్ద భూసార పరీక్షలను సైతం నిర్వహించారు. సుమారు రూ.653 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులకు ఈ నెల 19న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ప్రయాణికుల సేవలో..
నాన్ సబర్బన్ గ్రేడ్ –1 (ఎన్‌ఎస్‌జీ1) కేటగిరీకి చెందిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 1.8 లక్షల మంది ప్రయాణం చేస్తారు. రోజుకు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతాయి. పండుగలు, వేసవి సెలవులు, ఇతర ప్రత్యేక రోజుల్లో ప్రయాణికుల రద్దీ 2.3 లక్షల వరకు చేరుకుంటుంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి దక్షిణమధ్య రైల్వేకు ఏటా రూ.500 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. 2008లోనే వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
వరుసగా బడ్జెట్‌లలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. కానీ ముందుకు సాగలేదు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన స్టేషన్‌ల పునరభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి కార్యాచరణ మొదలైంది. స్టేషన్ భవనాలను, మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సేవలన్నింటినీ ఆధునికీకరించి ఎయిర్‌పోర్టు తరహాలో ప్రయాణికులకు సీమ్‌లెస్ సర్వీసులను అందజేయడం ఈ సమీకృత స్టేషన్ పునరభివృద్ధిలో భాగం.ఈపీసీ మొడల్‌లో టెండర్‌లను ఖరారు చేశారు.
ఇవీ సదుపాయాలు..
- ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సాఫీగా ప్రయాణం చేసేలా స్టేషన్ పునరభివృద్ధి చేపట్టనున్నారు. సిటీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో తదితర ప్రజారవాణా మార్గాల్లో ప్రయాణికులు స్టేషన్‌కు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీని పెంచడం ప్రధాన లక్ష్యం. పార్కింగ్ ఇబ్బందులను తొలగిస్తారు.
- స్టేషన్ పరిసరాల్లో ఎలాంటి రద్దీ లేకుండా నియంత్రించి ఆ స్థలాల్లో షాపింగ్‌మాల్స్,ఇతర వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తారు. కొత్త స్టేషన్ భవనంలో ఉత్తరం వైపు జీ+3 అంతస్థులు, దక్షిణం వైపు జీ+3 అంతస్తుల భవనాలను నిర్మిస్తారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ఉత్తరం వైపు మలి్టలెవల్ పార్కింగ్ సదుపాయం ఉంటుంది, దక్షిణం వైపు అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు.
- రెండు వైపులా రాకపోకలు సాగించే విధంగా 7.5 మీటర్ల వెడల్పుతో 2 నడక దారులను ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్ ఈస్ట్, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్‌లకు చేరుకొనేందుకు స్కైవేలను అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం స్టేషన్‌లో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లకు పూర్తిగా పైకప్పులు వేస్తారు. స్టేషన్‌కు చేరుకొనేందుకు, తిరిగి వెళ్లేందుకు వేరు వేరు ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. మరోవైపు స్టేషన్‌లో సుమారు 5000 కిలోవాట్స్ పవర్ సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment