సాక్షి, హైదరాబాద్: రైతులు ధాన్యం పండిస్తారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేస్తుంది. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి పండించిన ధాన్యాన్ని సేకరించి.. మిల్లింగ్ చేయించి.. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐ సూచించిన గోడౌన్లకు రాష్ట్రం పంపిస్తుంది. ఎఫ్‌సీఐ సెంట్రల్‌పూల్ విధానం ద్వారా ఆ బియ్యాన్ని పీడీఎస్, ఇతర సంక్షేమ పథకాల(ఓడబ్లు్యఎస్) కింద మళ్లీ ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. సాధారణంగా ఇదీ ధాన్యం సేకరణ, బియ్యం పంపిణీ విధానం. కానీ, దేశవ్యా ప్తంగా ధాన్యం దిగుబడి పెరిగి, బియ్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రేషన్ విధానాన్ని అమలు చేస్తుంది.
అవసరాల మేరకే కొనుగోలు..
ఎఫ్‌సీఐకి ఉన్న గోడౌన్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ సంస్థల ఆధ్వర్యంలోని గోడౌన్లు, ప్రైవేటు గోడౌన్లను కేంద్రమే అద్దెకు తీసుకుని నిర్వహిస్తుంది. కేంద్రం బియ్యం కొనుగోలు చేస్తేనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడి తిరిగివస్తుంది.
అయితే నిల్వసామర్థ్యం, మార్కెటింగ్‌ను బట్టే రాష్ట్రాలు పండించిన పంటలో తనకు అవసరమైన మేరకే బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోంది. ముందుగానే ఆ సంవత్సరానికి కొనుగోలు చేసే కోటా ఎంతో నిర్ణయించి ఎఫ్‌సీఐ ద్వారా సేకరిస్తుంది. మొత్తం బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తే.. నిల్వకు గోడౌన్లు సరిపోవు.
గిడ్డంగుల సామర్థ్యమే సమస్య..
2019–20లో ఎఫ్‌సీఐకి 20.47 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగుల కెపాసిటీ ఉండగా, 2020–21 నాటికి 23 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి గిడ్డంగుల కెపాసిటీ పెరిగింది. అయితే రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న బియ్యం, గిడ్డంగుల కెపాసిటీకి మధ్య చాలా తేడా ఉంది. గత సంవత్సరం ఖరీఫ్, రబీలో కలిపి 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి, సీఎంఆర్ కోసం మిల్లులకు పంపింది. దీని మిల్లింగ్ ద్వారా దాదాపు 95.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చింది.
గత వానాకాలం బియ్యం సెంట్రల్ పూలింగ్ విధానంలో ఎఫ్‌సీఐ ద్వారా పీడీఎస్, ఇతర అవసరాలకు పంపిణీ కాగా మిగిలినది గోడౌన్‌లకు చేరింది. ఇక యాసంగిలో సీఎంఆర్ ద్వారా రావలసిన 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నిల్వ చేయాలి. ఇందులో ఇప్పటి వరకు దాదాపు 50% సీఎంఆర్ ద్వారా గోడౌన్‌లకు చేరింది. మిగతా బియ్యం మిల్లుల నుంచి రావలసి ఉంది. ఈ పరిస్థితుల్లో బియ్యం నిల్వ చేయడానికి గోడౌన్‌లు లేక వేరే రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
8.13 కోట్ల మెట్రిక్ టన్నుల స్టోరేజీ..
ఎఫ్‌సీఐ, ఇతర గోడౌన్లు కలిపి దేశవ్యాప్తంగా 2,223 ఉన్నాయి. వీటి కెపాసిటీ 8.18 కోట్ల మెట్రిక్ టన్ను లు. ఈ గిడ్డంగుల్లో బియ్యంతో పాటు గోదుమలు, ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేయాలి. దీంతో బియ్యం నిల్వలకు సమస్య ఎదురవుతోంది. ఏ రాష్ట్రంలో సీఎంఆర్ ద్వారా సేకరించిన బియ్యాన్ని దాదాపుగా అదే రాష్ట్రంలో నిల్వ చేస్తుండటంతో తెలంగాణలో సమస్య వస్తోంది.
తెలంగాణలోని 72 గోడౌన్లలో 23 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ చేసే సామర్థ్యం ఉండగా, ఇప్పటికే 15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. తాజాగా యాసంగి బియ్యం వస్తుండటంతో ఎఫ్‌సీఐ చేతులెత్తేసింది. ఇందులో భాగంగానే వానాకాలం పంటను మిల్లులకు పంపించకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి.
బాసుమతికే ఎగుమతుల్లో డిమాండ్
అధిక బియ్యం సమస్యను పరిష్కరించాలంటే రెండే మార్గాలు. ఒకటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడం. రెండోది విదేశాలకు ఎగుమతి. బాసుమతి బియ్యం, నాణ్యమైన సన్న బియ్యాన్ని మాత్రమే ఆ దేశాలు తీసుకుంటుండటంతో సమస్య వస్తోంది.
నాలుగేళ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం...
రెండుమూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఉప్పు డు బియ్యం సుమారు 50 లక్షల టన్నుల వరకు రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ గోడౌన్‌లలో పేరుకుపోయినట్లు ఎఫ్‌సీఐ వర్గాల సమాచారం. అందు కే ఆ బియ్యం కొనబోమని కేంద్రం చెబుతోంది. ఉప్పుడు బియ్యం ఎగుమతులు తగ్గడం, దేశంలో ఈ బియ్యం తినే ప్రజలున్న రాష్ట్రాల్లోనూ బాయిల్డ్ మిల్లులు తెరవడంతో గోడౌన్‌లు ఖాళీ కావడం లేదు. ఈ విషయాన్ని ఇటీవల కేంద్రం చెప్పి, నిల్వ బియ్యం నాలుగేళ్లకు సరిపోతాయని పేర్కొంది.
6 కోట్ల మెట్రిక్ టన్నుల సేకరణ..
2020–21 ఖరీఫ్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రం సెంట్రల్ పూల్‌కు సేకరించిన బియ్యం 6 కోట్ల మెట్రిక్ టన్నులు. ఇందులో నుంచి 1.20 కోట్ల మెట్రిక్ టన్నులను కరువు కాటకాలు, యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజలు, సైనికులు, కార్మికుల కోసం నిల్వచేస్తారు. ప్రతి ఏటా ఈ నిల్వలను ఖాళీ చేసి కొత్త స్టాక్‌ను ఉంచుతారు. మరో 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అవుతుంది. మిగతా 3.6 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment