ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, యైటింక్లయిన్‌కాలనీ (రామగుండం): ప్రస్తుతం ఉన్నత చదువులంటే రూ.లక్షల్లో వ్యయం. ఈ పరిస్థితుల్లో ప్రతిభ ఉన్నా ఆర్థిక స్తోమత లేక చదువుకు దూరమయ్యేవారు ఎందరో. విద్యార్థుల ప్రతిభే దేశ భవిష్యత్‌కు పెట్టుబడి. అందుకే దానికి పేదరికం అడ్డు కాకూడదని కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకం కింద బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. మన దేశంలో, విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు రుణ రూపంలో ఇచ్చే నగదు మొత్తాన్ని చదువు పూర్తయిన ఏడాది తర్వాత చెల్లించే వెసులుబాటు ఉండటం మరో ప్రయోజనం. ఈ నేపథ్యంలో రుణ పరిమితి, దరఖాస్తు విధానం, తిరిగి చెల్లించడం ఎలా అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఈ కోర్సులకు ఇస్తారు..
విద్యార్థులు ప్రతిభావంతులై ఉండాలి. మంచి ర్యాంకుల రికార్డు ఉండాలి. విద్యార్థి ఎంత చురుగ్గా ఉన్నాడనే దానిపై రుణం ఇచ్చే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, హోటల్ మేనేజ్‌మెంట్, నర్సింగ్ తదితర కోర్సులకు ఆయా విశ్వవిద్యాలయాల స్థాయిని బట్టి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. విదేశాల్లో విద్యనభ్యసించాలంటే అంతర్జాతీయ స్థాయి ర్యాంకులు ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు పొంది ఉండాలి.
రుణాలిచ్చే బ్యాంకులు..
విద్యాలక్ష్మి పథకం కింద ఎస్‌బీఐ, సెంట్రల్ బ్యాంకు, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంకు, యూబీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐడీబీఐ, విజయా బ్యాంకు తదితర 13 వాణిజ్య బ్యాంకులు విద్యార్థులకు రుణాలు ఇస్తున్నాయి.
రూ 4.5 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు..
దేశీయ విద్యకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు, విదేశీ విద్యకు రూ.15 లక్షల నుంచి రూ.60 లక్ష ల వరకు రుణం మంజూరు చేస్తారు. ఎస్‌బీఐతో పాటు కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులు హార్వర్డ్ విశ్వవిద్యాలయం వంటి పేరుగాంచిన సంస్థల్లో చదవాలనుకునేవారికి గరిష్టంగా రూ.1.5 కోట్ల వరకు రుణం ఇచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రు ల వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలలోపు ఉన్న వి ద్యార్థులు రుణం తీసుకుంటే వడ్డీ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. దేశీయ విద్యకు రూ.7.5 లక్షల రుణం తీసుకుంటే 10 శాతం, ఆపైన తీసుకుంటే 10.75 శాతం వడ్డీ వసూలు చేస్తాయి (వడ్డీ రేట్లు ఆయా బ్యాంకులపై ఆధారపడి ఉంటాయి). రూ.4 లక్షల రుణం వరకు ఎవరూ హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ మొత్తం దాటి రూ. 7.5 లక్షల వరకు మూడో వ్యక్తి హామీ ఇవ్వాలి. ఇంకా ఎక్కువైతే ఆస్తులను హామీగా పెట్టాలి.
రుణం తిరిగి చెల్లించే విధానం..
విద్యార్థి కోర్సు పూర్తయిన ఏడాది తర్వాత నుంచి అసలు, వడ్డీ కలిపి ఆయా బ్యాంకుల నిబంధనల ప్రకారం చెల్లించాలి. గరిష్టంగా పదేళ్లలో వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. చదువు కొనసాగుతుండగానే తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి చెల్లింపులు చేస్తే రుణభారం తగ్గుతుంది. ఇది విద్యార్థి తల్లిదండ్రుల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. బ్యాంకుల నుంచి ఒత్తిడి ఉండదు.
పథకంపై పర్యవేక్షణ ఇలా..
విద్యాలక్ష్మి రుణాలు అందించే ఈ–పోర్టల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. కేంద్ర ఉన్నత విద్యా, మానవ వనరుల విభాగం, భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ) సంయుక్త భాగస్వామ్యంలో పథకాన్ని పర్యవేక్షిస్తారు. అంతిమంగా విద్యార్థులకు రుణాలిచ్చేవి బ్యాంకులే. కొన్ని దరఖాస్తులను తిరస్కరించే హక్కు కూడా వాటికి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
విద్యాలక్ష్మి పథకం కింద రుణం పొందాలనుకునే వారు హెచ్‌టీటీపీఎస్: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.విద్యాలక్ష్మి.కో.ఇన్‌లో లాగిన్ అవ్వాలి. మొదటి పేజీలోని రిజిస్టర్ బాక్స్‌ను క్లిక్ చేయాలి. అందులో అడిగిన పేరు ఇతర వివరాలు నమోదు చేయాలి. తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తుంది. వాటి ఆధారంగా రెండో బాక్స్ తెరవాలి. ఇందులో సింగిల్ ఫారం అని కనిపిస్తుంది. అందులోనూ అవసరమైన వివరాలు నమోదు చేయాలి. మూడో బాక్స్ తెరిచి, ఆఫ్‌లైన్ మల్టిపుల్ బాక్స్‌పై క్లిక్ చేయాలి. మనం ఏ బ్యాంకు ద్వారా రుణం పొందాలనుకుంటున్నామో వివరాలు నమోదు చేయాలి. అనంతరం అర్హతను బట్టి మనకు ఎంత రుణం వస్తుంది? ఎంత వడ్డీ.. ఎన్ని వాయిదాల్లో తిరిగి చెల్లించాలి అనే వివరాలను ఎప్పటికప్పుడు మన పాస్‌వర్డ్ ద్వారా వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు.
జత చేయాల్సిన ధ్రువపత్రాలు..
విద్యా రుణం పొందాలనుకునే విద్యార్ధులు తాము చవరగా చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ సర్టిఫికెట్, మార్కుల జాబితా, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఉపకార వేతనం పొందినట్లయితే ఆ వివరాలు, ఉన్నత విద్యా ర్యాంకు కార్డు, ప్రభుత్వ అనుమతి పత్రాలు, చేయాల్సిన కోర్సు మొత్తం ఫీజు వివరాలు, తల్లి, తండ్రి, సంరక్షకుడి పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, విద్యార్థి పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, విద్యార్థి తల్లి, తండ్రి ప్రభుత్వ ఉద్యోగులైతే వారి ఆదాయ ధ్రువపత్రాలు, నివాసాన్ని ధ్రువీకరించే ఓటర్ ఐడీ లేదా పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ జిరాక్స్ జత చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment