సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రంలో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ల దాఖలులో అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, అఫిడవిట్లకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే సమర్పించాలని స్పష్టం చేశారు. అఫిడవిట్‌లోని అన్ని కాలమ్స్ తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు.
వివరాల సమర్పణలో పొరపాట్లుంటే నామినేషన్ తిరస్కరిస్తామని, అందుకు అభ్యర్థే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించారు. అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, కానీ ఒకదానికి మాత్రమే డిపాజిట్ చెల్లుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో శుక్రవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకే పోలింగ్
రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ గంట కుదించడం జరిగిందని సీఈఓ తెలిపారు. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్. మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే జరుగుతుందని, మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు.
రైతుబంధుపై ప్రతిపాదనలు రాలేదు..
ప్రగతిభవన్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వివరణ వచ్చిందని, ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. రైతుబంధు పథకం కింద లబ్దిదారులకు సాయం అందజేతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదన్నారు. కోడ్ ఉల్లంఘనలపై 137 కేసులు ఫైల్ చేశామని, ఇందులో బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించి 13, కాంగ్రెస్ 16, బీజేపీ 5, బీఎస్‌పీకి సంబంధించి 3 కేసులు ఉన్నాయని చెప్పారు.
ఎమ్మెల్యేలు, ఎంపీల భద్రత జిల్లా ఎస్పీలు పర్యవేక్షిస్తారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 4 నెలలుగా దాదాపు 22 శాఖలతో సమావేశాలు నిర్వహిస్తోందని, అందులో ఐటీ శాఖ కూడా ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ శాఖ లు బాధ్యతతో పనిచేస్తున్నాయని వివరించారు.
తొలిసారిగా పెద్దసంఖ్యలో యువ ఓటర్లు
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.21 కోట్లకు చేరిందని, ఇందులో పురుషులు 1.609 కోట్లు, మహిళలు 1.608 కోట్లు ఉన్నారని సీఈఓ తెలిపారు. అక్టోబర్ 31వ తేదీ వరకు వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలన నవంబర్ 10వ తేదీలోగా పూర్తి చేస్తామన్నారు. 18–19 సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లు 9.10 లక్షల మంది ఉన్నారని, ఇంత పెద్ద సంఖ్యలో యువ ఓటర్లుండడం ఇదే తొలిసారి అని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్ స్టేషన్లున్నాయని, ఇందులో పట్టణ ప్రాంతంలో 14,458, గ్రామీణ ప్రాంతాల్లో 20,898 ఉన్నాయన్నారు. ఓటర్లకు ముందస్తుగానే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు అందజేస్తామని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రూ.453.93 కోట్లు సీజ్
రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.453.93 కోట్లు సీజ్ చేసినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. రూ.165.43 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.43.86 కోట్ల విలువైన వాహనాలు, కుక్కర్లు, చీరలు, సెల్‌ఫో న్లు తదితర వస్తువులు సీజ్ చేశామన్నారు. నగదు రవాణాకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రత్యే కంగా రూపొందించిన నిబంధనలు పాటించా లని సూచించారు. సీజ్ చేసిన ప్రతి రూపాయికి రసీదు ఇవ్వడం జరుగుతుందని, ఆధారాలు చూపితే తిరిగి ఇస్తున్నామని చెప్పారు.
ఇప్పటివరకు 362 కేసులు నమోదు చేయగా, 256 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. 2,928 బైండోవర్లు ఉన్నాయని, 7,460 ఆయుధాలు డిపాజిట్ చేశామని తెలిపారు. నాన్‌బెయిలబుల్ వా రెంట్లు 238 జారీ చేశామని, ఇప్పటివరకు సీ విజిల్‌కు 2,487, 1950 నంబర్‌కు 437 ఫిర్యాదులు వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 205 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment