చీకోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో, ఈడీ విచారణలో ఏపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్లు చెప్పాలని పదేపదే బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని చీకోటి ప్రవీణ్ కుమార్ తెలిపారు. వారి పేర్లు చెప్పకపోతే ఓ ప్రమాదకరమైన వెబ్‌సైట్ ద్వారా తనని చంపేందుకు సుపారీ ఇస్తున్నట్టు బెదిరిస్తున్నారని చీకోటి ప్రవీణ్ ‘సాక్షి’కి చెప్పారు. బెదిరింపుల వెనక అక్కడి ప్రతిపక్ష పార్టీ ఉందా లేదా ఆ పార్టీ ముసుగులో ఎవరైనా చేస్తున్నారా అన్నది పోలీసుల విచారణలో తేలుతుందన్నారు.
తాను రాష్ట్రంలో కాకుండా లీగల్‌గా క్యాసినో ఎక్కడ నడుస్తుందో అక్కడే వ్యాపారం చేస్తున్నట్టు వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా రెండు రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకుల్లో స్నేహితులున్నారని, అలా ఉండటంలో తప్పేంటన్నారు. స్నేహితులుగా ఉన్నంత మాత్రాన వారికి సంబంధంలేని వ్యవహారాల్లో వాళ్ల పేర్లు చెప్పడం పద్ధతి కాదంటూ చీకోటి చెప్పుకొచ్చారు. అదేవిధంగా నేపాల్ క్యాసినో వ్యవహారంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తప్ప పెద్దగా ఎవరు రాలేదని, పలువురు సినీ ప్రముఖులకు తాను కోట్ల రూపాయలు చెల్లించినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టంచేశారు.
ఈ లెక్కల వ్యవహారాలు పూర్తిగా ఈడీకి వివరించినట్టు తెలిపారు. తాను చిన్ననాటి నుంచి జంతు ప్రేమికుడినని, కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకునే పలు జంతువులు, పక్షులను పెంచుతున్నట్టు చెప్పారు. ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలిపారు. తన భద్రత విషయంలో హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టాలని, లేకపోతే మరోసారి హైకోర్టుకు వెళతానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment