సాక్షి, హైదరాబాద్, కొండపాక(గజ్వేల్): మొన్నటికి మొన్న ఈడీ మనీలాండరింగ్ కేసు... నిన్నటికి నిన్న థాయ్‌లాండ్‌లో గుట్టురట్టయిన అక్రమ కెసినో వ్యవహారం... ఈ రెండింటిలోనూ ప్రధానంగా వినిపించిన పేరు చీకోటి ప్రవీణ్ కుమార్. నగరానికి చేరుకున్న ప్రవీణ్ పటాయా కెసినో వ్యవహారంపై స్పందిస్తూ మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు.
ఆ వీడియోలో ప్రవీణ్ మాట్లాడుతూ... ‘థాయ్‌లాండ్‌లో నేను ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. ఆ ఈవెంట్ దేవ్, సీత అనే వాళ్లు నిర్వహించారు. పోకర్ టోర్నమెంట్ 4 రోజులు పాటు జరుగుతోందని నాకు ఆహ్వానం పంపారు. నేను అక్కడకు వెళ్లిన నాలుగో రోజు సదరు హోటల్‌లోని కాన్ఫరెన్స్ రూమ్‌ను సందర్శించా. అందులో అడుగుపెట్టిన 15 నుంచి 20 నిమిషాల్లోనే పోలీసులు దాడి చేశారు. అప్పుడే నాకు వాళ్లు పంపింది నకిలీ ఆహ్వానపత్రిక అని తెలిసింది.
ఆ అక్రమ కెసినో నిర్వహించింది నేనే అయితే ఇంత తేలిగ్గా తిరిగి రాలేను. అలాంటి వాటికి అక్కడ కఠినమైన శిక్షలు ఉన్నాయి. థాయ్‌లాండ్‌లో అక్రమంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తే ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్షపడుతుంది. నా పాస్‌పోర్టు కూడా బ్లాక్‌లిస్ట్ చేసే వాళ్లు. పోలీసులు దాడి చేసిన రోజు అక్కడి న్యాయస్థానానికి సెలవు. మరుసటి రోజు కోర్టులో స్వల్ప జరిమానాతో విడిచిపెట్టారు’ అని వివరించారు.
నామీద చాలా కుట్రలు
‘నా చుట్టూ చాలా కుట్రలు జరుగుతున్నాయి. నేను రాజకీయ పార్టీలోకి వస్తున్నానని కొందరు అనుకుంటున్నారేమో..! ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పటాయాలో అక్రమ కెసినోతో నాకు ఎలాంటి సంబంధం లేదని నిర్వాహకులు దేవ్, సీత కూడా అక్కడి పోలీసుల వద్ద అంగీకరించారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి నేను అక్కడ రూ.50 లక్షలు లంచం ఇచ్చానని జరుగుతున్న ప్రచారం సత్యదూరం. ఆ ఈవెంట్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు’అని ప్రవీణ్ అన్నారు.
నాకేం సంబంధం లేదు: దేవేందర్‌రెడ్డి
థాయ్‌లాండ్‌లోని పటాయాలో జరిగిన గ్యాంబ్లింగ్ డెన్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విహార యాత్రకు వెళ్లగా.. అక్కడి హోటల్‌లో ఇండియన్ ఫుడ్ తయారు చేయించామంటూ స్నేహితులు చెప్పడంతో ఆ హోటల్‌కు వెళ్లామన్నారు. 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చి పట్టుకున్నారని చెప్పారు. అక్కడ ఫోకర్ గేమ్ మాత్రమే పెట్టారని తెలిపారు. తమపై పెట్టిన కేసు నిరాధారమంటూ కోర్టు కొట్టివేసిందన్నారు. కొందరు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
చీకోటి ప్రవీణ్
Comments
Please login to add a commentAdd a comment