
సాక్షి, శంషాబాద్: శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) శుక్రవారం రాత్రి 10 గంటలకు నగరంలోని యశోద ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె హృదయ సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. నగరంలోని ఆమె కూతురు వద్ద ఉండగా.. రాత్రి అకస్మాత్తుగా షుగర్ లెవెల్స్ పడిపోయాయి. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. అదే రోజు రాత్రి ఆమె పార్థివదేహాన్ని శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులో ఉన్న శ్రీరామనగరానికి తీసుకువచ్చారు. శనివారం మధ్యాహ్నం దహన సంస్కారాలు నిర్వహించగా.. చినజీయర్ స్వామి నిప్పంటించారు. మైహోం గ్రూపు సంస్థల అధినేతలు జూపల్లి రామేశ్వర్‌రావు, జూపల్లి జగపతిరావు, జీవా, జిమ్స్ సిబ్బంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
శారదా పీఠాధిపతి సంతాపం
పెందుర్తి: త్రిదండి చినజీయర్ స్వామి మాతృమూర్తి పరమపదించడంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి విచారం వ్యక్తం చేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Comments
Please login to add a commentAdd a comment