సూర్యాపేట మార్కెట్‌లో రైతుల కష్టాలను వింటున్న కాంగ్రెస్ పార్టీ బృందం
భానుపురి/వలిగొండ/బీబీనగర్/నల్లగొండ: ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం వట్టిమాటలను కట్టిపెట్టకపోతే, రైతులు సీఎం కేసీఆర్ తోలు ఒలచడం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీమంత్రి జి.చిన్నారెడ్డి హెచ్చరించారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచనల మేరకు చిన్నారెడ్డి, మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలతో కూడిన బృందం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించింది.
సూర్యాపేటలో వ్యవసాయ మార్కెట్‌ను సం దర్శించి రైతులతో మాట్లాడింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎదుల్లగూడెం, బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి, నల్లగొండ మండలం ఆర్జాలబావిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించింది. చిన్నారెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని నెలరోజులుగా కొనకుండా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తుందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పి ఇప్పుడు వరి వేయొద్దనడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ ప్రాంతంలో వరి తప్ప వేరే పంటలు పండించే పరిస్థితి లేదన్నారు. రైతులను లక్షాధికారులుగా చేస్తామని మాటలతో ఉబ్బించి ఇప్పుడు రోడ్డున పడేశారని దుయ్యబట్టారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వమే కొనుగోలు చేసేవరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని హామీనిచ్చారు. వరికి కనీస మద్దతుధర రూ.1,960 చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment