ఈ నెల 14న ఇమ్లీబన్ బస్టాండ్‌లో కిడ్నాప్‌నకు గురైన మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వేగవంతంగా స్పందించిన పోలీసులు దాదాపు 10 గంటల్లోనే కిడ్నాపర్‌లను గుర్తించి బాలిక అవంతికను రక్షించారు. కొండాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నాగార్జున భార్య లక్ష్మితో కలిసి తమ సొంతూరు బళ్లారికి వెళ్లేందుకు శనివారం ఇమ్లీబన్‌కు వచ్చారు. ఈ క్రమంలో వారి మూడేళ్ల కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయగా అఫ్జల్‌గంజ్ పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు ఏడు టీంలుగా ఏర్పడి..సీసీ ఫుటేజీల ఆధారంగా కేసును ఛేదించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంగమోడి శివుడు, పార్వతమ్మలు కిడ్నాప్‌కు పాల్పడినట్లు గుర్తించి... మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. కేసు ఛేదన కోసం పోలీసులు ఎంతో శ్రమకోర్చినందుకు సీపీ అంజనీకుమార్ వారిని ప్రశంసించారు.
హిమాయత్‌నగర్: మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కేవలం 10 గంటల్లోనే బాలిక ఆచూకీని గుర్తించి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం నగర పోలీసు అంజనీకుమార్ వెల్లడించారు. తక్కువ వ్యవధిలోనే కేసును కొలిక్కి తెచ్చిన పోలీసులను ఆయన అభినందించారు. సీపీ అంజనీ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నాగార్జున, లక్ష్మి దంపతులు వాచ్‌మెన్‌లు. వీరికి మూడేళ్ల కుమార్తె అవంతిక ఉంది. ఈ నెల 14న కర్ణాకటలోని బళ్లారి వెళ్లేందుకుకు నగరంలోని మహాత్మాగాంధీ బస్సుస్టాండ్ (ఎంజీబీఎస్)కు వచ్చారు. వీరితో పాటు లక్ష్మి అక్క జయలక్ష్మి కూడా ఉన్నారు. ఎంజీబీఎస్‌లో బళ్లారి బస్సెక్కారు. ఈ క్రమంలో నాగార్జునకు బళ్లారి వెళ్లేందుకు ఆసక్తి లేక బస్సు దిగేశాడు. నాగార్జునను బుజ్జగించేందుకు భార్య లక్ష్మి కూడా రావడంతో.. కొద్ది నిమిషాలకు జయలక్ష్మి కూడా కిందకు దిగింది. తనతో ఉన్న అమ్మ, నాన్న, పెద్దమ్మ ఎవరూ కనిపించకపోవండంతో.. వారిని వెతుకుతూ బాలిక అవంతిక వెళ్లింది. ఏడ్చుకుంటూ తిరుగుతున్న చిన్నారిని మహబూబ్‌నగర్ జిల్లా సంగినాయిపల్లి వాసులు సంగమోడి శివుడు, పార్వతమ్మలు తమ వెంట తీసుకుని పరారయ్యారు. చదవండి: రాష్ట్రంలో కిడ్నాప్‌ల కలకలం
ఆచూకీ ఇలా..
తమ కూతురు అవంతిక కనిపించకపోవడంతో నాగార్జున, లక్ష్మి దంపతులు అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈస్ట్‌జోన్ డీసీపీ కె.మురళీధర్ సుల్తాన్‌బజార్ ఏసీపీ పి.దేవేందర్‌లు రంగంలోకి దిగారు. ఎస్‌హెచ్‌ఓ ఎం.రవీందర్‌రెడ్డి, డీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మాన్‌సింగ్‌లు 7 జట్లుగా ఏర్పడ్డారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చారు. కేవలం 10 గంటల్లో మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
వాట్సప్ గ్రూప్స్‌తో..
పోలీసులు ఎంజీబీఎస్, పురానాపూల్ ప్రాంతాల్లో వైపు వచ్చిన బస్సులను తనిఖీ చేశారు. ఆ రూట్‌లో బళ్లారి, మహబూబ్‌నగర్ వెళ్లే బస్సు డ్రైవర్, కండక్టర్లతో కలిసి ఎస్సై మాన్‌సింగ్ ఓ వాట్సప్ గ్రూప్‌ని క్రియేట్ చేశారు. ఈ గ్రూపులో కనీసం 50– 60మంది ఉన్నారు. ఎంజీబీఎస్‌లో సంగమోడి శివుడు, పార్వతమ్మలు చిన్నారి అవంతికను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న సీసీ ఫుటేజీ వీడియోను పోస్ట్ చేశారు. వారి ఆచూకీని గుర్తించిన బస్సు డ్రైవర్, కండక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు అఫ్జల్‌గంజ్ పోలీసులు. సీసీ ఫుటేజీల ఆధారంతో నిందితులను పట్టుకున్నారు.
అయిదు కేసుల్లో జైలుకు..
సంగమోడి శివుడు, పార్వతమ్మలు కూలిపనులు చేస్తుంటారు. వివాహమై ఆరేళ్లయినా వీరికి సంతానం కలగలేదు. ఇదే క్రమంలో శివుడు సెల్‌ఫోన్‌లు చోరీ చేసి 22 నెలల పాటు, భువనగిరి పోలీసు స్టేషన్ పరిధిలో మరో సెల్‌ఫోన్ చోరీ కేసులో 6 నెలల పాటు మొత్తం 28 నెలలపాలు జైలులో ఉండి ఇటీవల విడుదలయ్యాడు. తమకు పిల్లలు లేకపోవడంతో అవంతికను కిడ్నాప్ చేసినట్లు ఈస్ట్‌జోన్ డీసీపీ కె.మురళీధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment