సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలో ఇప్పుడు ఏ నోట విన్నా మునుగోడు ఉప ఎన్నిక మాటే వినపడుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా మారిన ఈ ఎన్నికలు జరుగుతున్న తీరును రాజకీయ పరిశీలకులు, నిపుణులతో పాటు అన్ని రాజకీయ పక్షాల నేతలు, సామాన్యులు నిశితంగా గమనిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి క్రమంగా వేడెక్కుతూ వస్తున్న మునుగోడు రాజకీయం నామినేషన్ల దాఖలు సమయానికి మరింత హీటెక్కింది.
ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కావడం, అన్ని పార్టీలు పోటీలు పడి సభలు, సమావేశాలు నిర్వహించడం, ఆయా పార్టీల ముఖ్య నేతలు మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ సందడి నెలకొంది. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలోని ఓ గ్రామానికి ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకున్నారంటేనే ఈ ఎన్నికను రాజకీయ పక్షాలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమవుతోంది.
కదన రంగంలోకి పార్టీలు..
మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు కదనరంగంలోకి దూకాయి. టీఆర్‌ఎస్ నుంచి మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, జయపాల్‌యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, మాణిక్యరావు, చిరుమర్తి లింగయ్య, రవిశంకర్‌లతో పాటు పలు నియోజకవర్గాల ఇన్‌చార్‌్జలు గ్రామాల్లో తిరుగుతున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇన్‌చార్జ్ గా ఉన్న గట్టుప్పలలో సిరిసిల్ల టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ నాగయ్యతోపాటు గంప గోవర్ధన్ ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇక, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే ప్రచారంలో చురుకుగా పాల్గొంటుండగా ఆ పార్టీ నేతలు వివేక్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు వచ్చి కేడర్‌ను ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు. ఆదివారం కేంద్ర మంత్రి భూపేందర్‌యాదవ్, ఎంపీ లక్ష్మణ్ కూడా వచ్చారు. త్వరలోనే బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, నడ్డాలు కూడా రానున్నారు. ఇక, కాంగ్రెస్ నుంచి పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పటికే గ్రామాలను చుట్టివస్తున్నారు. మండలానికి ముగ్గురు ఇన్‌చార్జ్ ల చొప్పున టీపీసీసీ నేతలు, స్థానిక నాయకులు గ్రామాల్లో టీఆర్‌ఎస్, బీజేపీలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ ఆదివారం సాయంత్రం చౌటుప్పల్ సభలో పాల్గొన్నారు. ఐదు రోజులపాటు నియోజకవర్గంలోనే రేవంత్‌రెడ్డి మకాం వేయనున్నారు.
మరోమారు సభలు..
మూడు ప్రధాన రాజకీయపక్షాలు మరోమారు బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో సీఎం కేసీఆర్ బహిరంగసభ ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అమిత్‌షా, నడ్డాలతో ఒకటి లేదంటే రెండు సభలు ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, భారత్‌జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వస్తున్న రాహుల్‌గాంధీ పాల్గొనేలా నియోజకవర్గానికి సమీపంలో ఉన్న శంషాబాద్‌లో సభ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. పార్టీలు బీసీ సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ సామాజిక వర్గాల వారీగా నేతలను రంగంలోకి దింపాయి. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నియోజకవర్గంలోని యాదవ సామాజికవర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు.
సీఎం పర్యవేక్షణ..
టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం సీఎం కేసీఆర్ స్వయంగా ఓ ఎంపీటీసీ స్థానం ఇన్‌చార్జ్ బాధ్యతలను తీసుకోవడం విశేషం. ఆ గ్రామానికి సంబంధించిన పరిస్థితి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ ఫోన్‌లో పర్యవేక్షిస్తున్నారని గులాబీ శ్రేణులంటున్నాయి. మొత్తంమీద మూడు పార్టీల ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులతో మునుగోడు నియోజకవర్గ పొలిటికల్ థియేటర్‌లో అన్ని షోలు హౌజ్‌ఫుల్ కావడం గమనార్హం.
సెమీఫైనల్‌లో సత్తా చాటేందుకు
రాబోయే అసెంబ్లీ ఎన్నిలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ లాంటిదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అనూహ్యమైన సంఘటనలు జరిగితే తప్ప 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపోటములు, ఆయా పార్టీలకు లభించే ఓట్లను బట్టి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్ ఉంటుందని ప్రధాన రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా తెలంగాణలో తామే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని చాటుకునేందుకు బీజేపీ, మునుగోడులో గెలవడం ద్వారా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను మాత్రమే ప్రజలు ఆదరిస్తారని చెప్పుకునేందుకు గులాబీ పార్టీ, సిట్టింగ్ స్థానంలో గెలుపు ద్వారా తమపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి తమకు మాత్రమే ఉందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మూడు పార్టీల్లో గెలిచిన పార్టీకి 2023 ఎన్నికలకు వెళ్లడం సులువవుతుందని, ఓడిన పార్టీలు మాత్రం ఓటమి భారంతోనే ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందనేది రాజకీయ వర్గాల అభిప్రాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment