సాక్షి, హైదరాబాద్: ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’నినాదంతో దేశం కోసం బయలుదేరిన బీఆర్‌ఎస్ పార్టీపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బరితెగింపు దాడులు చేస్తూ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటోందని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడులు, కుట్రలను ఛేదిస్తూ సాహసమే ఊపిరిగా సాగుతున్న తన ప్రయాణంలో పార్టీ కార్యకర్తలే బలం, బలగం అని స్పష్టం చేశారు. ‘భారత్ రాష్ట్ర సమితి కుటుంబసభ్యులకు నమస్తే’అంటూ.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ సోమ వారం ఒక ఆత్మీయ సందేశాన్ని విడుదల చేశారు.
బీఆర్‌ఎస్ గట్టి సిపాయి
‘14 ఏళ్ల పాటు అధికారంలో లేకున్నా కేసులు, జైళ్లకు వెరవకుండా జెండా భుజాన వేసుకుని, పార్టీని కాపాడుకుని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కార్యకర్తలకే దక్కుతుంది. ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల కృషితోనే రెండు పర్యాయాలు తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారం చేపట్టింది. 21 ఏళ్ల ప్రయాణంలో పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఏకపక్ష విజయాలు సాధించి రికార్డులను తిరగరాసి గమ్యాన్ని ముద్దాడిన గట్టి సిపాయి బీఆర్‌ఎస్.
కొత్త రాష్ట్రాన్ని కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నాం. ఇతరులకు రాజకీయాలు క్రీడలాంటివి. బీఆర్‌ఎస్‌కు మాత్రం ఒక టాస్క్..’అని కేసీఆర్ పేర్కొన్నారు.
అభివృద్ధిలో దేశం వెనుకబాటు
‘కష్టాలు, కన్నీళ్లు, కరువుతో అల్లాడిన తెలంగాణ పచ్చని పంటల కళకళలాడుతోంది. ప్రభుత్వ పథకాలు ఆణిముత్యాల్లా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. కలలో కూడా ఊహించని పనులను చేపట్టి తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుంది. కుల మతాలకు అనుగుణంగా తెలంగాణ సమాజానికి పొత్తుల సద్దిమూటగా బీఆర్‌ఎస్ అవతరించింది.
అయితే దేశంలో 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా తాగు, సాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు కరువయ్యాయి. అన్ని వనరులు ఉన్నా అభివృద్ధిలో దేశం వెనుకబాటుకు గురైంది. చైనా, సింగపూర్, దక్షిణ కొరియా లాంటి దేశాలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నా, కుల, మతాల కుమ్ములాటతో భారత్ అభివృద్ధి సాధించలేకపోతోంది. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీలకు తెలివి, విజన్ లేదు..’అని కేసీఆర్ దుయ్యబట్టారు.
తెలంగాణతో బీఆర్‌ఎస్‌ది పేగు బంధం
‘కొత్త ఎజెండాతో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకే బీఆర్‌ఎస్ మరో ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ప్రజల సమస్యలు ఇతివృత్తంగా పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌ను తెలంగాణ సమాజం వదులుకోదు. తెలంగాణతో బీఆర్‌ఎస్‌ది పేగు బంధం. పురిటిగడ్డపై మరోమారు విజయం తథ్యం..’అని కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల ఏడాదిలో నిరంతరం ప్రజల్లో ఉంటూ విపక్షాలు చేసే దుష్త్ర్పచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసే బాధ్యత పార్టీ కేడర్‌పైనే ఉందని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే బలం.. బలగం
Published Tue, Mar 21 2023 3:00 AM | Last Updated on Tue, Mar 21 2023 3:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment