- క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు, అనుసరించాల్సిన వ్యూహాల సమీక్ష
- రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల తీరుతెన్నులపై చర్చ
- జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ, ఇతర అంశాలపైనా సమాలోచనలు
- ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీకి కేసీఆర్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జాతీయస్థాయిలో బీఆర్‌ఎస్ విస్తరణ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన మంత్రులు కె.తారకరామారావు, టి.హరీశ్‌రావులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇద్దరు మంత్రులు తమ రోజువారీ కార్యకలాపాలను రద్దు చేసుకొని మరీ సీఎంతో నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం కావడం గమనార్హం. హరీశ్‌రావు తన ఆదిలాబాద్ జిల్లా పర్యటనను రద్దు చేసుకొని ప్రగతిభవన్‌కు రాగా.. రంగారెడ్డి జిల్లా చందనపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.
అభివృద్ధి పనులు, ప్రచారంలో దూకుడు
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల భేటీలో జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయ అంశాలతోపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. వివిధ వర్గాల సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న పథకాల తీరుతెన్నులపై చర్చించిన సీఎం కేసీఆర్.. విస్తృత ప్రచారం ద్వారా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు అమలు చేయాలని సూచించినట్టు సమాచారం.
జిల్లాల్లో ఇంకా ప్రారంభంకాని కొత్త కలెక్టరేట్లకు ముహూర్తాలు పెట్టుకోవాలని, ఆయా నియోజకవర్గాల్లో పూర్తిచేసిన పనులపై విస్తృత ప్రచారం చేసుకునేలా ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేయాలని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకలాపాల తీరును సమీక్షించి.. ఆయా చోట్ల అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్ధేశం చేసినట్టు సమాచారం. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు చేపట్టిన కార్యక్రమాలపైనా ముగ్గురు నేతలు సమాలోచనలు జరిపినట్టు తెలిసింది.
ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీకి కేసీఆర్
జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ను విస్తరించే క్రమంలో అనుసరిస్తున్న వ్యూహాలపైనా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చర్చించినట్టు తెలిసింది. ఢిల్లీలో నిర్మిస్తున్న బీఆర్‌ఎస్ భవన్ నిర్మాణ పనులను çపరిశీలించడంతోపాటు జాతీయ మీడియాతో సమావేశం అయ్యేందుకు ఒకట్రెండు రోజుల్లో సీఎం ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. ఇప్పటికే బీఆర్‌ఎస్ భవన్ పనుల పరిశీలన కోసం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇక జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలలో కలసి వచ్చే పారీ్టల నేతలతో సమావేశాలపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment