సాక్షి, కల్వకుర్తి: మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (75) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన.. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కరెంట్ కిష్టారెడ్డి గా పేరున్న ఈయన వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్, ఎంపీపీ పదవులతో పాటు రెండుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. 1967లో సోషలిస్టు పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. అది జనతా పార్టీలో విలీనం కావడంతో అందులో చేరారు. 1973, 1981లో కల్వకుర్తి సర్పంచ్‌గా, 1987లో మండలాధ్యక్షుడిగా, 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2004లో మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. (చదవండి: అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి..)
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో కలసి పనిచేసినా రాజకీయంగా విభేదించి టీడీపీలో చేరారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అనంతరం 2018లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎడ్మ కిష్టారెడ్డి అంత్యక్రియలు కల్వకుర్తిలోని ఆయన వ్యవసాయ పొలంలో మంగళవారం పూర్తయ్యాయి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కాసేపు పాడె మోశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు.
సామాజిక స్పృహ కలిగిన నాయకుడు: సీఎం కేసీఆర్
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాజిక స్పృహ కలిగిన నాయకుడిగా ప్రజల అభిమానం సంపాదించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి సంతాపం తెలిపారు.
నిజాయితీకి నిలువెత్తు రూపం: ఏపీ సీఎం జగన్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నిబద్ధత, నిరాడంబరత, నిజాయితీకి నిలువెత్తు రూపం ఎడ్మ కిష్టారెడ్డి అని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటు న్నట్లు పేర్కొన్నారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
కాంగ్రెస్ నేతల సంతాపం
ఎడ్మ కిష్టారెడ్డి మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, సంపత్ కుమార్, చల్లా వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి సంతాపం తెలిపారు. రైతులకు ఎప్పుడూ కరెంటు, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు అంటూ కరెంటు కిష్టారెడ్డిగా గుర్తింపు పొందారని జానారెడ్డి గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment