
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమావేశం కానున్నారు. తంగెళ్లపల్లి మండలంలోని మండెపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి, వాటి పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇదే గ్రామంలో ‘టైడ్స్’ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్)ను, సిరిసిల్ల మండలంలోని సర్దాపూర్‌లో వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభించనున్నారు. సిరిసిల్ల మండలం రాగుడు గ్రామంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. రోడ్డు మార్గాన జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గంలోనే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. కేసీఆర్ రాకను పురస్కరించుకొని శనివారం ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఏర్పాట్లను సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment