మంగళవారం అల్వాల్‌లో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన వైద్యసేవలు పూర్తిగా అందరికీ అందుబాటులోకి రావాలని, నిరుపేదలు దోపిడీకి గురికాకూడదనే ఆలోచనతో హైదరాబాద్ నలు దిక్కులా ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక ఆసుపత్రులను నెలకొల్పుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 1.64 కోట్ల జనాభా నివసిస్తోందని, అంతేకాక చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా బాగా పెరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం మీద మాత్రమే వైద్య సేవల భారం మొత్తం పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్) పేరుతో హైదరాబాద్ గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ, అల్వాల్ ప్రాంతాల్లో నిర్మించనున్న మూడు ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
అందుబాటులో ఖరీదైన వైద్య సేవలు
‘ఏ సమస్య వచ్చినా గాంధీకో, ఉస్మానియాకో, నీలోఫర్‌కో పరిగెత్తకుండా ఈ ఆసుపత్రుల నిర్మా ణం ద్వారా నగరానికి నలువైపులా (ఇప్పటికే గచ్చిబౌలిలో టిమ్స్ ఉంది) నిరుపేదలకు ఖరీదైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఆసుపత్రు లతో కలిపి మొత్తం 6 వేలకు పైగా పడకలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో 1,000 నుంచి 1,500 వరకూ ఐసీయూ పడకలు ఉండేలా చూస్తున్నాం. నిమ్స్‌లో కూడా 2 వేల పడకలను పెంచుతు న్నాం. టిమ్స్‌లో అన్ని సేవలతో పాటు వందో, రెండు వందల పడకలతోనో ప్రత్యేకమైన ప్రసూతి కేంద్రం కూడా ఇక్కడే నిర్వహించినట్లైతే మళ్లీ వేరేచోటికి పోయే అవసరం రాదు. ఆరోగ్య శాఖ ఈ మేరకు చర్యలు తీసుకోవాలి..’అని సీఎం అన్నారు.
పటిష్టమైన వైద్య వ్యవస్థతో తక్కువ నష్టం
‘మానవులు ఈ భూగోళం మీదకు 4 లక్షల ఏళ్ల క్రితం వచ్చారు. కానీ వైరస్‌లన్నీ మనుషులు రావడానికి 4 లక్షల ఏళ్ల క్రితమే వచ్చాయని ఎంటమాలజిస్టులు చెప్పారు. అవి ఎప్పుడెప్పుడు ప్రకోపం చెందుతాయో అప్పుడు వ్యాప్తి చెందుతాయి అని చెప్తే.. నేను బేజారై కరోనా అయిపోదా అంటే కరోనా తాతలు కూడా భవిష్యత్తులో రానున్నాయన్నారు. కాబట్టి కరోనా లాంటి వ్యాధులు మళ్లీ మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయి. వైరస్‌లు లేకుం డా చేసే వ్యవస్థ లేదు. కానీ అవి వచ్చినప్పుడు ఎవరికైతే పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంటుందో వారు తక్కువ నష్టంతో బయటపడతారు. ఎక్కడైతే వైద్య వ్యవస్థ బాగా ఉండదో అక్కడ లక్షల మంది చనిపోతారు. విద్య, వైద్యం పేదలకు అందాలనేదే మా లక్ష్యం. వైద్య విద్య మీద బాగా దృష్టి పెట్టనున్నాం. కొత్తగా మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం’ అని కేసీఆర్ తెలిపారు.
టీకా సెంటర్‌గా హైదరాబాద్
‘ఎక్కడెక్కడ నుంచో ఇక్కడకి వచ్చి తమ సంస్థలు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తుండడం వల్లే హైదరాబాద్‌లో 7 ఏళ్లలో 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటి ద్వారా 10–15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్‌లో 14 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ, యూనివర్సిటీ తేనున్నాం. ప్రపంచంలోనే 33% టీకాలు తయారు చేసే సెంటర్ హైదరాబాద్..’అని సీఎం పేర్కొన్నారు.
సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం
‘మనది కొత్త రాష్ట్రం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ ఇవన్నీ ఎప్పటినుంచో పెద్ద రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. కానీ మన తలసరి ఆదాయం వీటన్నింటినీ మించి నమోదైంది. సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం. తెలంగాణ పచ్చబడాలె, ఇంకా ముందుకు పోవాలె. దేశానికి తలమానికంగా ఉండేలా మారాలె. దాని కోసం ఎంతధైర్యంగానైనా ముందుకు పోతాం. ఎవరితోనైనా పోరాడతాం..’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల, సబిత, తలసాని, మల్లారెడ్డి, ఎంపీలు కేకే, సంతోశ్, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
- టిమ్స్ అంటే మామూలుగా ఏదో చిన్న దవాఖానా కట్టరు. ఇక్కడ 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయి. ఎయిమ్స్ తరహాలో టిమ్స్‌కు రూపకల్పన చేస్తున్నాం. వీటి ద్వారా నూటికి నూరు శాతం ప్రభుత్వ ఖర్చుతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుంది.
- కొందరు మత విద్వేషంతో మాట్లాడుతున్నారు.అన్ని మతాలు, కులాలని సమానంగా ఆదరించే గొప్ప దేశం మనది. ఈ సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ గాకుండా పోతాం. సామరస్యతను దెబ్బతీసే కేన్సర్ లాంటి జబ్బు మనల్ని పట్టుకుంటే చాలా ఇబ్బందులు పడతాం.
- ఇవాళ తెలంగాణలో కరెంటు పోతే వార్త. కానీ దేశంలో కరెంటు ఉంటే వార్త. ప్రధాని ప్రాతినిధ్యం వహించిన గుజరాత్‌లో కూడా రైతులు రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తున్నారు. కానీ ఏడేళ్ల క్రితం పుట్టిన పసికూన తెలంగాణ రాష్ట్రంలో రాత్రింబవళ్లు కష్టపడి 24 గంటల కరెంటు అన్ని రంగాలకూ ఇస్తున్నాం. – సీఎం కేసీఆర్
కులం, మతం పేరిట చిల్లర రాజకీయాలు
‘రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు (మంగళవారం) రాజకీయ సభలు జరుపుతున్నాయి. కానీ మనం కంటోన్మెంట్‌లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నాం. ఇదీ వాళ్లకు మనకూ ఉండే తేడా. ఇలాంటి పరిస్థితు ల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రం వచ్చాక మారిన పరిస్థితులు చూడాలి. ఫలానా వాళ్ళ షాపులో పూలు కొనొద్దు. ఫలానా వాళ్ల షాపులో ఇది కొనొ ద్దు. అది కొనొద్దు అని కొందరు మత విద్వేషంతో మాట్లాడుతున్నారు. దీనిపై ప్రజలుగా మీరు ఆలోచన చేయాలి. కొందరు కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. మతపిచ్చి అనేది ఏదో తాత్కాలికంగా మజా అనిపిస్తుంది. కానీ శాశ్వతంగా మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. విదేశాల్లో పనిచేస్తున్న 13 కోట్ల మంది భారతీయుల్ని ఇలాగే వెనక్కి పంపిస్తే వారికి ఉద్యోగాలు ఎవరివ్వాలి? అందువల్ల అటువంటి సంకుచిత ధోరణులకు తెలం గాణలో ఆస్కారమివ్వొద్దు’ అని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment