ఇక ఇందిరమ్మ కమిటీలు.. | CM Revanth Reddy Jana Jatara Public Meeting in Chevella | Sakshi
Sakshi News home page

ఇక ఇందిరమ్మ కమిటీలు..

Published Wed, Feb 28 2024 4:51 AM | Last Updated on Wed, Feb 28 2024 4:51 AM

CM Revanth Reddy Jana Jatara Public Meeting in Chevella - Sakshi

గ్రామాల్లో ఏ పథకమైనా వాటి ద్వారానే లబ్ధిదారుల ఎంపిక.. అమలు 

చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ ‘జన జాతర’ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన 

గ్రామాల్లో ఐదుగురితో ఏర్పాటు 

మేం ఉద్యోగాలిస్తుంటే ఓర్వలేక శాపనార్థాలు 

కేటీఆర్‌.. దమ్ముంటే ఒక్క ఎంపీ సీటైనా గెలిపించి చూపించు 

ఇది ఇనాం కుర్చినో.. వారసత్వంగా వచ్చిందో కాదన్న సీఎం 

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు కోసం గ్రామాల్లో ఇంది రమ్మ కమిటీలను ఏర్పాటు చేయ బోతున్నామని.. ప్రభుత్వం ప్రక టించిన ఏ పథకానికైనా ఇకపై ఆ కమిటీల ద్వారానే అర్హులు/లబ్ధిదా రులను ఎంపిక చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వివిధ సామాజికవర్గాలకు చెందిన ఐదు గురు సభ్యులతో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తామని, వాటిద్వారానే పథకాలను అందజేయనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పేదబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని భరించలేక కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత వంటివారంతా కాంగ్రెస్‌ పార్టీకి శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చేవెళ్లలో ‘జన జాతర’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. 
 
‘‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. నియామకాల ముసుగులో ఒక్క కుటుంబంలోని వారికే పదవులు వచ్చాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు రెండు నెలల్లోనే 25వేల ఉద్యోగాలు భర్తీచేశాం. ఇది చూసి ఓర్వలేని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితారావు అంతా కలిసి కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి శాపనార్థాలు పెడుతున్నారు. పేదల బిడ్డలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే మీ కడుపు మండిందా? 

త్వరలోనే మెగా డీఎస్సీ 
నీ బిడ్డ కవితను ప్రజలు ఓడిస్తే.. ఆరు నెలల్లోనే ఎమ్మెల్సీని చేశావు. ఎంపీగా ఓడిన బంధువు వినోద్‌రావును ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ చేశావు. మా పేదోళ్లు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీ బిడ్డలు పదేళ్లు తల్లిదండ్రుల కష్టార్జితంతో అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌ కోచింగ్‌ సెంటర్లలో చదివినా ఉద్యోగాలు రాక, పెళ్లిళ్లుగాక రోడ్లపై తిరుగుతుంటే.. చెట్లకు ఉరేసుకుని చనిపోతుంటే...  ఏ ఒక్కరోజైనా ఆలోచన చేశావా కేసీఆర్‌? నువ్వు మనిషివా.. మానవ రూపంలో ఉన్న మృగానివా? ఏ ఒక్కరోజైనా ఆ పేదబిడ్డల గురించి ఆలోచన చేశావా? కానీ కాంగ్రెస్‌ వచ్చిన వెంటనే 25వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. మార్చి 2న మరో రెండు వేల గ్రూప్స్‌ పోస్టులు భర్తీ చేస్తాం, త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. 

కుర్చిని తాకడం నీ తరం కాదు 
బీఆర్‌ఎస్‌ పాలనలో పరీక్ష పత్రాలను జిరాక్స్‌ సెంటర్లలో పల్లీ బఠానీల్లాగా అర్రాస్‌ (వేలం) పెట్టారు. ఇందుకు కారణమైన వారిని అరెస్టు చేశారా? మేం వచ్చిన తర్వాత జైల్లో వేశాం. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశాం. మీ నోటి నుంచి ఏనాడైనా అభినందించారా? ఎప్పుడు కుర్చిలో కూర్చుందామా అని ఎదురు చూస్తున్నారు. ఇది ఇనాం కుర్చీ కాదు. వారసత్వంగా వచ్చిందికాదు. నల్లమల నుంచి కార్యకర్తగా కష్టపడితే వచ్చింది. దీన్ని తాకడం నీతరం కాదు. ఈ ప్రభుత్వం మూడు నెలలకో, ఆరు నెలలకో కూలుతుందని ఎవరైనా గ్రామాల్లోకి వచ్చి చెప్తే.. వారిని చెట్టుకు కట్టేసి తగిన బుద్ధి చెప్పండి. 

ఒక్కసీటైనా గెలిపించి చూపించు! 
ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డినే సీఎం అని చెప్తే కాంగ్రెస్‌కు మూప్పై సీట్లు కూడా రాకపోయి ఉండేదని ఓ సన్నాసి చెప్తుండు. నేను సవాల్‌ విసురుతున్నా.. ఇప్పుడు రేవంతే సీఎం, పీసీసీ అధ్యక్షుడు. నీకు దమ్ముంటే, ధైర్యముంటే రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కసీటైనా గెలిపించి చూపించు. నీలా తండ్రి పేరు చెప్పుకుని కుర్చిలో కూర్చోలేదు. కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి, లాఠీదెబ్బలు తిని, అక్రమ కేసుల్లో అరెస్టయి చర్లపల్లి జైల్లో మగ్గిన. భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి ఎదురొడ్డి కొట్లాడిన అసలు సిసలైన కార్యకర్తను నేను. మిమ్మల్ని ఓడించి కుర్చిలో కూర్చున్నోడిని. ఈ కార్యకర్తలు నాకు అండగా నిలబడ్డంత కాలం దేవుడొచ్చినా ఈ కుర్చిని తాకలేడు. 

గ్యారంటీలు అమలు చేసి తీరుతం.. 
సోషల్‌ మీడియా ఉంటే తామే గెలిచేవాళ్లమని కేటీఆర్‌ చెప్తున్నాడు. టీవీలు, పేపర్లన్నీ మీ చుట్టపోళ్లవే కదా! మాకేమన్నా మైకులు ఉన్నాయా? సినిమా థియేటర్లు ఉన్నాయా? క్లబ్‌హౌస్‌లు ఉన్నాయా? కార్యకర్తలు కష్టపడితేనే మాకు అధికారం వచ్చింది. మాకు ఆ ట్యూబ్, ఈ ట్యూబ్, ఏ ట్యూబ్‌ అక్కరలేదు. మా కార్యకర్తలే మీ ట్యూబులైట్లు పగలగొట్టే బాధ్యత తీసుకున్నరు. సోనియాగాంధీ ఇచ్చిన హామీ మేరకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. 

మహిళలను కోటీశ్వరులను చేస్తాం.. 
ఆడబిడ్డల కోసం ఆనాడు దీపం పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. రూ.4 వందలకే సిలిండర్‌ ఇచ్చింది. కానీ మోదీ వచ్చిన తర్వాత రూ.1,200కు పెంచి మహిళల కంట కన్నీళ్లు తెప్పిస్తున్నారు. మేం రూ.500కే సిలిండర్‌ ఇస్తున్నాం. ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు నింపేందుకు 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభించాం. మహిళలను కోటీశ్వరులను చేస్తాం. వచ్చే ఎన్నికల్లో 14 మంది కాంగ్రెస్‌ ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపండి. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది..’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. 

చంపడమేనా గుజరాత్‌ మోడల్‌? 
బీజేపీ పదే పదే గుజరాత్‌ మోడల్‌ అని చెబుతోందని.. ఊర్లో ఉన్నవాళ్లందరినీ తగలబెట్టడమే మోడలా? అని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ‘‘ఇతర రాష్ట్రాల్లో ఉన్న పెట్టుబడిదారులను బెదిరించి మీ రాష్ట్రాలకు గుంజుకపోవుడా మీ మోడల్‌? ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపారు. ఇదేనా గుజరాత్‌ మోడల్‌? నిన్న మొన్నటి వరకు ఈ కేడీ, ఆ మోడీ కలిసే ఉన్నారు. ఇవాళ మేం వేరని చెప్తున్నారు. ఈ నాటకాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది?’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement