మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
2050 విజన్‌తో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం..
ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ
పాతబస్తీ మెట్రో రైల్ నిర్మాణ పనుల శంకుస్థాపనలో సీఎం రేవంత్
ఇక్కడి నుంచి మెట్రోను ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేస్తాం
చంచల్‌గూడ జైలు స్థలంలో స్కూల్, కాలేజీ.. మూసీ నదిని సుందరీకరిస్తాం
మజ్లిస్‌తో కలసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తానన్న సీఎం
పాతబస్తీకి మెట్రో సంతోషకరం: అసదుద్దీన్
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): హైదరాబాద్ మహా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, పాతబస్తీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 2050 విజన్‌తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఎంఐఎం పార్టీతో కలసి పనిచేస్తామని చెప్పారు. శుక్రవారం పాతబస్తీ మెట్రోరైల్ నిర్మాణ పనులకు ఫలక్‌నుమా ఫారూక్‌నగర్‌లో సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘హైదరాబాద్‌లో రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం.
కంటోన్మెంట్‌లో రోడ్ల విస్తరణ చేపట్టాం. హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో మెట్రోరైల్ విస్తరిస్తే సామాన్య ప్రజలకు వెసులుబాటుగా ఉంటుంది. 2050 విజన్‌తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. అందరూ ఈ ప్రాంతాన్ని ఓల్డ్ సిటీ అని చిన్నచూపు చూస్తుంటారు. కానీ ఈ ప్రాంతమే ఒరిజినల్ సిటీ. ఓల్డ్ సిటీపై నాకు అవగాహన ఉంది. మా ఊరు(కల్వకుర్తి)కు చాంద్రాయణగుట్ట, సంతోష్నగర్ మీదుగానే వెళతాం. పాతబస్తీలో రోడ్ల నిర్మాణం కోసం ఎంపీ అసదుద్దీన్ కోరిన వెంటనే రూ.200 కోట్లు మంజూరు చేశాం. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడో మెట్రోరైల్‌ను ప్లాన్ చేసిన గత పాలకులు పాతబస్తీ మెట్రోను విస్మరించారు. మేం నాగోల్ నుంచి ఎల్‌బీనగర్‌కు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, పి–7 రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రోను అనుసంధానం చేస్తాం. దీంతోపాటు రాజేంద్రనగర్‌లో నిర్మించనున్న హైకోర్టు వరకు, రాయదుర్గం–ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, మియాపూర్–ఆర్సీపురం వరకు మెట్రోను విస్తరిస్తాం. మీరాలం ట్యాంక్ వద్ద రూ.363 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడతాం.
అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే..
మెట్రోరైల్, ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్ట్ అన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించాం. 2004 నుంచి 2014 మధ్య హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి తాగునీటిని తీసుకొచి్చన ఘనత కాంగ్రెస్‌దే. మూసీ నదిని సుందరీకరించి, దేశంలోనే చక్కటి టూరిస్ట్ స్పాట్‌గా మారుస్తాం. ఇందులో భాగంగానే అక్బరుద్దీన్ ఒవైసీతో కలసి లండన్‌లో థేమ్స్ నదిపై అధ్యయనం చేశాం. గుజరాత్‌లో సబర్మతీ నదిని అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ.. ఇక్కడ గండిపేట నుంచి 55 కిలోమీటర్ల పొడవునా మూసీ సుందరీకరణకు కూడా కేంద్ర నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచి్చనది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే. నేను కూడా మైనారీ్టల అభ్యున్నతికి కృషి చేస్తా. అందుకే మైనార్టీ శాఖ, మున్సిపల్ శాఖలను నా వద్దే ఉంచుకున్నా.
చంచల్‌గూడ జైలును తరలిస్తాం
చంచల్‌గూడ జైలును హైదరాబాద్ నగరం వెలుపలకు తరలిస్తాం. ఆ స్థలంలో కేజీ, పీజీ క్యాంపస్ ద్వారా విద్యను అందిస్తాం. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మిస్తాం. 1994–2004 మధ్య టీడీపీ, 2004–2014 కాంగ్రెస్, 2014–2023 వరకు బీఆర్‌ఎస్ పాలించాయి. నేను 2024 నుంచి 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మజ్లిస్ ఎమ్మెల్యేలు ముబీన్, మీర్ జులీ్ఫకర్ అలీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, అహ్మద్ బలాలా, ఎమ్మెల్సీ రియాజుల్ హఫెండీ, ప్రభుత్వ సలహారు షబ్బీర్ అలీ, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, మెట్రోరైల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాతబస్తీకి మెట్రో సంతోషకరం: అసదుద్దీన్ ఒవైసీ
పాతబస్తీకి మెట్రో రైల్ వస్తుండటం సంతోషకరమని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇది అందుబాటులోకి వస్తే పాతబస్తీ నుంచి నిత్యం 10–15వేల మంది హైటెక్ సిటీకి వెళతారని చెప్పారు. సీఎం రేవంత్ పాతబస్తీ అభివృద్ధిపై దృష్టి సారించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా ఈ ప్రాంతం నుంచి తరలించాలని కోరారు. డీఎస్సీని ఉర్దూ మాధ్యమంలో కూడా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ సుందరీకరణకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. దేశంలో విద్వేషాన్ని నింపుతున్న వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment