కలెక్టర్ నారాయణరెడ్డి
సాక్షి, ఇందూరు : కడ్తా పేరిట రైతులను దోచుకుంటున్న వారిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కడ్తా తీసే మిల్లర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన ధాన్యానికి కూడా రైస్ మిల్లర్లు కడ్తా తీస్తే రైతులు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. కడ్తా తీసిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఆదివారం క్యాంప్ కార్యాలయం నుంచి వ్యవసాయ, సహకార, రెవెన్యూ, సివిల్ సప్లయి, ఐకేపీ అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో సేకరిస్తున్న నాణ్యమైన ధాన్యాన్ని కడ్తా లేకుండా తీసుకునేలా అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటోందని చెప్పారు.
జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. అయితే, నాణ్యంగా ఉన్న ధాన్యానికి రైస్ మిల్లర్లు కడ్తా తీసుకున్నా, కొనుగోలు కేంద్రాల్లో ఇతర ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి రైతుల కోసం కాల్ సెంటర్ (18004256644, 73826 09775)ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రైతులు పంట కోసే ముందు హార్వెస్టర్ యంత్రాల్లో సరైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. యంత్రం వేగం ఏ–2, ఏ–3లలో, బ్లోయర్ వేగం 19–26 మధ్యలో ఉంచి కోతకు వెళ్లాలని, తద్వారా నాణ్యమైన ధాన్యం వస్తుందని కలెక్టర్ వివరించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తరువాత వ్యవసాయ అధికారులు పరిశీలించి నాణ్యతను ధ్రువీకరిస్తారని, నాణ్యత సరిగా లేకుంటే కడ్తా ఎంత తీయాలో సూచిస్తారన్నారు. వర్షాలు, తదితర కారణాల వలన నాణ్యత తక్కువగా ఉంటే అందులో ఐదు నుంచి పది శాతానికి మించి నాణ్యత తగ్గదన్నారు.
రైస్ మిల్లర్లు కూడా వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ ఆధారంగా ధాన్యాన్ని తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి కడ్తా తీసుకుంటే మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో కొనుగోలు కేంద్రం బాధ్యులు, ఇతరులపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులపై కూడా చర్యలుంటాయన్నారు. రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని, చెన్నీ తప్పనిసరిగా పట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్‌లో ఓపీఎంఎస్ ఎంట్రీ ఎప్పటికప్పుడు చేసి రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు సమీక్షించుకుంటూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment