తెలంగాణ పదేళ్ల ఉత్సవాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల హడావుడి 'దశాబ్ది దంగల్‌'! | Congress and BRS Focus Telangana Formation day ten year celebrations | Sakshi
Sakshi News home page

తెలంగాణ పదేళ్ల ఉత్సవాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల హడావుడి 'దశాబ్ది దంగల్‌'!

Published Thu, May 30 2024 3:58 AM | Last Updated on Thu, May 30 2024 8:00 AM

దశాబ్ది ఉత్సవాలపై నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, అందెశ్రీ, కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

దశాబ్ది ఉత్సవాలపై నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, అందెశ్రీ, కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

అధికారంలో ఉండటంతో తమ ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ 

ఆర్భాటంగా వేడుకల నిర్వహణకు ప్రణాళిక.. సోనియాకు ఆహ్వానం

అధికారిక గేయం ఎంపిక.. అధికారిక చిహ్నానికి మార్పులపై కసరత్తు 

గత ఏడాదే 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించిన నాటి బీఆర్‌ఎస్‌ సర్కారు 

అధికారం కోల్పోవడంతో ఇప్పుడు పార్టీ పరంగా మూడు రోజుల పాటు ముగింపు వేడుకలు 

కేసీఆర్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీకి ప్రణాళిక.. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు 

అధికారిక చిహ్నాలను మారుస్తుండటంపై తీవ్ర విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ రగడ ప్రారంభమైంది. దశాబ్ది ఉత్సవాలపై తమ ముద్ర వేసుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ హడావుడి చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పూర్తిగా తమ మార్క్‌ కనిపించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందిస్తోంది. మరోవైపు అధికారంలో ఉండగానే (గత ఏడాది జూన్‌లోనే) దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వపరంగా నిర్వహించిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు పార్టీపరంగా దశాబ్ది ముగింపు ఉత్సవాలకు సిద్ధమవుతోంది. మరోవైపు దశాబ్ది ఉత్సవాలకు కొనసాగింపుగా పలు అంశాలపై కసరత్తు చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణ అధికారిక గేయాన్ని ఖరారు చేశారు. అధికారిక చిహ్నంలోనూ మార్పులపై దృష్టిపెట్టారు. ఈ మార్పులను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌ సర్కారుపై విమర్శలు గుప్పిస్తోంది. 

గన్‌ పార్క్‌ నుంచి మొదలు.. 
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సోనియా గాం«దీని ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకురాలిగా ఆమెను సత్కరించాలని నిర్ణయించింది. 2న అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అరి్పంచడంతో దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి నుంచి పరేడ్‌ గ్రౌండ్‌కు వెళ్లి ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కారి్నవాల్, లేజర్‌ షో, శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అధికారిక గేయమైన ‘జయజయహే తెలంగాణ’కు జాతీయ జెండాలతో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

గత ఏడాది జూన్‌లోనే ఉత్సవాలు చేపట్టి.. 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంలోనే అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశాబ్ది ప్రారంభ ఉత్సవాలను చేపట్టింది. 2023 జూన్‌ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు గ్రామగ్రామాన ఈ వేడుకలను నిర్వహించింది. కేసీఆర్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ పోరాటంతోనే రాష్ట్ర సాధన జరిగిందని చెప్పుకోవడంతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగపడేలా కార్యక్రమాలను నిర్వహించింది. ఇప్పుడు దశాబ్ది ముగింపు ఉత్సవాల పేరుతో మూడు రోజుల కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. జూన్‌ 1వ తేదీనే గన్‌ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి అమరజ్యోతి ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2న కేసీఆర్‌ అధ్యక్షతన సభ నిర్వహించనున్నారు. 3వ తేదీన జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ జెండా, జాతీయ పతాకం ఆవిష్కరణ, హాస్పిటళ్లు, అనాథ శరణాలయాల్లో పండ్లు, మిఠాయిల పంపిణీ వంటి కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. 
 


అధికార చిహ్నం మార్పులపై విమర్శలు 
దశాబ్ది ఉత్సవాల క్రమంలోనే.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాచరిక ఆనవాళ్లు లేకుండా చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను అధికారిక లోగో నుంచి తొలగించే ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్‌ తీవ్రంగా విరుచుకుపడుతోంది. తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ చెప్పిందని.. అధికారిక చిహ్నాలను మార్చడమే మీరు తెచ్చే మార్పా అని నిలదీస్తోంది. అయితే ఈ అంశాలపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. దశాబ్ది వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కానీ దశాబ్ది వేడుకలకు సోనియాగాం«దీని ఏ హోదా ఉందని పిలుస్తారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

రాష్ట్రం ఇచ్చిన దేవతగా సోనియా ఈ కార్యక్రమానికి వస్తారంటూ కాంగ్రెస్‌ నేతలు ప్రతిస్పందిస్తుండటంతో.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికారిక గేయంగా ప్రకటించిన ప్రభుత్వం.. దానికి తుదిరూపునిచ్చే క్రమంలో ఏపీకి చెందిన సంగీత దర్శకుడు కీరవాణిని ఎంచుకోవడంపై బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కళాకారులకు ప్రాంతీయ హద్దులేమిటని.. అయినా బీఆర్‌ఎస్‌ హయాంలో ఆంధ్రా ప్రాంతానికి చెందినవారికి లభించిన గౌరవం మాటేమిటంటూ కాంగ్రెస్‌ నేతలు నిలదీస్తున్నారు. మొత్తంగా దశాబ్ది ఉత్సవాలతో రాష్ట్రంలో రాజకీయ దంగల్‌ జరుగుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement