సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మరో యాత్రకు సిద్ధమవుతోంది. మార్పు కోసం పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘హాథ్‌సే హాథ్ జోడో’ యాత్ర ఓ వైపు కొనసాగిస్తుండగా, మరోవైపు నుంచి ఇంకో యాత్ర ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో వెల్లడించారు.
మహేశ్వర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి మూడో తేదీ నుంచి ‘కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్ర’ పేరుతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. బాసర సరస్వతీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భైంసా వరకు తొలి రోజు యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత నిర్మల్, ఖానాపూర్, ఉట్నూర్, ఆదిలాబాద్, ఇచ్ఛోడ మీదుగా బోథ్ వరకు తొమ్మిదో తేదీవరకు యాత్ర నిర్వహిస్తారు.
మధ్యలో మార్చి 7వ తేదీన హోలీ సందర్భంగా యాత్రకు విరామం ప్రకటించనున్నారు. తొమ్మిదో తేదీన బోథ్ వరకు తొలి విడత యాత్ర ముగిసిన తర్వాత రెండో విడత షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. మొత్తం మీద బాసర నుంచి హైదరాబాద్ వరకు యాత్రను పూర్తి చేసి, ముగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించేలా యాత్ర షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 1,2 రోజుల పాటు యాత్ర కొనసాగేలా షెడ్యూల్ తయారు చేశామని, అధిష్టానం ఆదేశాల మేరకే ఈ యాత్ర జరుగుతోందని, యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలందరూ పాల్గొంటారని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment