సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే 20 వేల మిలియన్ యూనిట్లు కావాలి. ఈ మేరకు విద్యుత్ కొనేందుకు ఏటా రూ.16,500 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ప్రభుత్వం లెక్కలు చూపెడుతోంది. కానీ రైతులకు ఇస్తున్నది 8–10 గంటలే. ఇందుకు అయ్యే ఖర్చు రూ.8వేల కోట్లు మాత్రమే. మరి మిగతా రూ.8,500 కోట్లు ఎక్కడికి వెళుతున్నాయి? దానిపై బీఆర్‌ఎస్ సర్కారు విచారణకు సిద్ధమా?’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు.
రాష్ట్రంలో చేపట్టిన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ అంచనాలను పెంచేసి కమీషన్లు తీసుకున్నారని, ఈ వ్యవహారంలో రూ.15 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పేరుతో జరుగుతున్న దుర్వినియోగాన్ని తాను ప్రస్తావిస్తే బీఆర్‌ఎస్ నేత లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మంత్రి కేటీఆర్ గంతులు వేస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ అంశంపై సిరిసిల్ల, సిద్ధిపేట, చింతమడక, గజ్వేల్‌లలో రైతు వేదికలు సహా ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని, దమ్ముంటే రావాలని కేటీఆర్‌కు సవాల్ చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించ తలపెట్టిన మూడు పవర్ ప్రాజెక్టులకు రూ.45,730 కోట్లతో టెండర్లు పిలిస్తే అందులో రూ.15వేల కోట్లు అవినీతి జరిగిందని, కేసీఆర్ ప్రభుత్వం 30% కమీషన్లు తీసుకుందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న రుణాలతో జెన్‌కో, ట్రాన్స్‌కో అప్పుల పాలయ్యాయని.. ఆ భారం విద్యుత్ వినియోగదారులపై పడుతోందని చెప్పారు. బందిపోటు దొంగలు, దండుపాళ్యం ముఠాలు కూడా బీఆర్‌ఎస్‌లా దోపిడీకి పాల్పడ లేవని విమర్శించారు. బీఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తే మహిళల మెడలోని తాళిబొట్లనూ అమ్మేస్తుందని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ నేతలను నిలదీయండి
విద్యుత్ రంగంలో ప్రభుత్వ అవినీతి, రైతాంగ సమస్యలపై బీఆర్‌ఎస్ నేతలను నిలదీయాలని, వారు రైతు వేదికల వద్దకు వచ్చినప్పుడు నిరసన తెలపాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. రుణమాఫీ చేసే వరకు రైతు వేదికలకు తాళాలు వేయాలని, పేదల నుంచి లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగి ఇచ్చే వరకు నేతలను నిర్బంధించాలని సూచించారు. ఎమ్మెల్యే లను కూడా చెట్లకు కట్టేయాలని వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌కు ఆ స్థాయి ఉందా?
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు ఉందా అని రేవంత్ మండిపడ్డారు. ఏది కావాలనుకున్నా తన ముందుకు తెచ్చుకోగలిగిన స్థాయి ఉన్న, చదువుకున్న రాహుల్ వంటి నేత.. పేదలు, రైతుల కష్టాలను తెలుసు కునేందుకు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. కేటీఆర్‌కు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా, దుక్కి దున్నడం, సాలు కొట్టడ మంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.
వ్యవసాయం అంటే అంట్లు తోమడం కాదు
కేటీఆర్‌పై రేవంత్ ట్వీట్
ఎడ్లు, వడ్ల గురించి రాహుల్ గాంధీకి తెలియదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి స్పందించారు. వ్యవసాయమంటే అమెరికాలో అంట్లు తోమడం కాదని, ఎడ్లు, వడ్లు అని ప్రాస కోసం పాకులాడే గాడిదలకు గంధపు చెక్కల వాసన ఏం తెలుస్తుందని సోమవారం ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ‘ఎవుసం అంటే గెస్ట్‌హౌస్‌లలో సేదతీరడం కాదు. సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు. అది మట్టి మనసుల పరిమళం. మట్టి మనుషుల ప్రేమ’ అని పేర్కొన్నారు. తన ట్వీట్‌కు రాహుల్ దుక్కి దున్ని నాట్లు పెడుతున్న ఫొటోలను జత చేశారు.
Comments
Please login to add a commentAdd a comment