సాక్షి, హైదరాబాద్: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు చేపట్టిన చలో రాజ్‌భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్క్ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్వంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనను పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎలాగైనా చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ యత్నించగా, దానిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్‌లు అప్రజాస్వామికం.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజభవన్‌కు వస్తున్న వేలాది మంది నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా కోసం అనుమతికి దరఖాస్తు చేశామన్నారు. పోలీసులు.. గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడం రాజరిక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. మరోవైపు పోలీసులను నుంచి తప్పించుకుని వచ్చిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్‌భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు కట్టడం చర్చనీయాంశమైంది.
అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్...
జెండాలు కట్టిన వారిపై చర్యలు
ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. భద్రతా వైఫల్యంపై సమీక్ష నిర్వహించారు. అధికారుల ఫిర్యాదుతో కాంగ్రెస్ జెండాలు పెట్టిన ఇద్దరిపైనా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, రాజ్‌భవన్ గేట్ బయట ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో హుటాహుటిన సీసీ కెమెరాలు మరమ్మతు చేపట్టినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment