డీఎస్ ఇక లేరు
గుండెపోటుతో హైదరాబాద్ నివాసంలో కన్నుమూత
రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన డీఎస్
ఉమ్మడి ఏపీలో రెండుసార్లు పీసీసీ చీఫ్‌గా, వైఎస్సార్ హయాంలో మంత్రిగా బాధ్యతలు
బీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక
తిరిగి సొంత గూటికి చేరిన డీఎస్
అనారోగ్యంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరం
డీఎస్ మరణంపై రాజకీయ ప్రముఖుల సంతాపం
నిజామాబాద్‌లో రేపు ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(76) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్.. 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా పని చేశారు. 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీపీ చీఫ్‌గా ఉన్నారు. వైఎస్సార్ హయాంలో మంత్రిగా ఈయన పని చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన డీఎస్.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు, ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనారోగ్యం కారణంగానే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారాయన.
డీఎస్ కుటుంబం
డీఎస్‌కు భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ పనిచేశారు. డీఎస్ మృతితో తెలంగాణ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నివాసంలో డీఎస్ పార్థివ దేహాన్ని ఉంచారు. కడసారి చూసేందుకు డీఎస్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు చేరుకుంటున్నారు. సాయంత్రం నిజామాబాద్ ప్రగతినగర్‌లోని నివాసానికి డీఎస్ పార్థీవ దేహం తరలించనున్నారు. రేపు మధ్యాహ్నాం నిజామాబాద్‌లో డీఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్వహించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment