డీఎస్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ నేతలు(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కుటుంబంలో చేరికల చిచ్చు చెలరేగింది. నిన్న (ఆదివారం)డీఎస్, ఆయన కుమారుడు సంజయ్ తిరిగి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే సొంతగూటికి చేరిన ఒక్కరోజుకే(సోమవారం) ఆ పార్టీకి రాజీనామా చేస్తునట్లు డీఎస్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. డీఎస్ లేఖ రాస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు.
రాజీనామా లేఖను ఆయన సతీమణి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. డీఎస్ ఆరోగ్యం సహకరించట్లేదని, కాంగ్రెస్ వాళ్లు తమ ఇంటి వైపుకు రావొద్దని డీఎస్ భార్య విజ్ఞప్తి చేశారు. కాగా తొలుత కాంగ్రెస్ నేత అయిన డీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత టీఆర్‌ఎస్(ప్రస్తుత బీఆర్‌ఎస్) పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.
కొంతకాలంగా బీఆర్ఎస్‌కు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తన కొడుకు సంజయ్‌తో కలిసి గాంధీభవన్‌కు వచ్చిన డీఎస్.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే మరుసటి రోజే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కాగా డీఎస్ మరో కొడుకు అర్వింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.
కాగా ‘కొడుకు సంజయ్ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆశీస్సులు ఇవ్వడానే గాంధీభవన్‌కు వచ్చాను. కానీ తాను కూడా మళ్లీ పార్టీలో చేరినట్టుగా మీడియాలో ప్రచారం చేశారు. నేను ఎపన్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ.. ప్రస్తుతం నా వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. నన్ను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని మీరు భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment