కాంగ్రెస్‌ వార్‌ రూం కేసు.. మల్లు రవిపై కేసు నమోదు | Congress War Room Case: Senior Leader Mallu Ravi Named As Accused | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వార్‌ రూం కేసు: మల్లు రవిపై కేసు నమోదు.. సునీల్ కనుగోలు పోలీసులకు ఏం చెప్పాడంటే..

Published Wed, Jan 11 2023 12:31 PM | Last Updated on Wed, Jan 11 2023 1:50 PM

Congress War Room Case: Senior Leader Mallu Ravi Named As Accused - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌ కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చిన పోలీసులు.. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు. 

పార్టీ వ్యూహకర్తగా పేరు వినిపిస్తున్న సునీల్ కనుగోలు స్టేట్‌మెంట్‌ ఆధారంగానే మల్లు రవిపై కేసు నమోదు అయ్యింది. అయితే.. మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు మల్లు రవి వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం హాజరు కావాల్సిందిగా ఇచ్చిన నోటీసులపై ఆయన వివరణ కోరగా.. గురువారం విచారణ కోసం వచ్చినప్పుడే చెప్తామని అధికారులు బదులు ఇచ్చారు. ఈ క్రమంలో.. బుధవారం ఈ సీనియర్‌ నేత పేరును నిందితుడిగా చేర్చారు సైబర్ క్రైమ్ పోలీసులు. 

సాక్షి టివీ చేతిలో సునీల్ కనుగోలు స్టేట్ మెంట్
‘‘కాంగ్రెస్ వార్ రూంతో నాకు సంబంధం లేదు.
నేను కాంగ్రెస్‌కు వ్యూహాలు మాత్రమే చెప్తాను.
వార్ రూం ఇంఛార్జి మల్లు రవి. 
మల్లు రవి చెప్పింది మాత్రమే మా టీం చేస్తుంది’’
                 :::పోలీసులకు సునీల్ కనుగోలు స్టేట్‌మెంట్‌ 

సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో.. గతేడాది నవంబర్‌ 24వ తేదీన మాదాపూర్‌లోని సునీల్‌ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకుని ఆఫీస్ సీజ్ చేశారు. అయితే.. తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులను మల్లు రవి, షబ్బీర్ అలీతోపాటు కొంతమంది నేతలు అడ్డుకున్నారు కూడా.

ఇక సునీల్‌ కనుగోలు కింద పనిచేస్తున్న మెండా శ్రీ ప్రతాప్‌, శశాంక్‌, ఇషాంత్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా సునీల్‌ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో సీఆర్‌పీసీ 41A కింద మల్లు రవికి సోమవారం నోటీసులు అందజేశారు. ఈనెల 12వ తేదీన(గురువారం) విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో అసలేం జరుగుతుంది? అక్కడ ఏం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు? పూర్తి వివరాలపై విచారణ చేసేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇన్‌ఛార్జి అయిన మల్లు రవికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నా.. కేసు నమోదు కావడంతో తర్వాతి పరిణామం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement