ఆయన పోలీస్ కానిస్టేబుల్. అక్రమ దందాలను మోసాలను అరికట్టి అన్యాయాన్ని ఎదురించాల్సిన బాధ్యత అతనిది. కానీ కానిస్టేబుల్భా హోదాలో ఉండి భార్యతో కలిసి ఘరానా మోసానికి తెరలేపాడు. లక్ష ఇస్తే రెండు లక్షలు ఇస్తాం, తులం బంగారం ఇస్తే రెండు తులాలు ఇస్తామని నమ్మబలికి ఇద్దరి దగ్గర కోటి 75 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు నగదు సేకరించి మోసానికి పాల్పడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా సాగిన చీటింగ్ రాకెట్‌ను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. కానిస్టేబుల్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.
సాక్షి, వరంగల్: కాదేది మోసానికి అనర్హం అన్నట్లు ఓరుగల్లు లో కానిస్టేబుల్ ఫ్యామిలీ ఘరానా మోసానికి పాల్పడింది. అమాయక ప్రజల అత్యాశను సొమ్ము చేసుకునే కుట్ర పన్ని అడ్డంగా బుక్కయ్యారు. హనుమకొండ పరిమిళకాలనీలో నివాసం ఉండే కానిస్టేబుల్ సయ్యద్ ఖాసిం, ఆయన భార్య సయ్యద్ సహేదాతోపాటు భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడకు చెందిన తులసేగారి రాజబాబు ముగ్గురు కలిసి మాయమాటలతో మహిళలను నమ్మించి లక్షలాది రూపాయలతో పాటు భారీగా బంగారు ఆభరణాలు వసూలు చేశారు.
ఒక లక్ష ఇస్తే రెండింతలు ఇస్తామని, తులం బంగారం ఇస్తే రెట్టింపు బంగారాన్ని ఇస్తామని చెప్పి నమ్మకం కుదిరేలా ఒకరిద్దరికి తీసుకున్న నగలు, నగదుకు వారం రోజుల్లోనే రెట్టింపు చెల్లించారు. కానిస్టేబుల్ కావడం అనుకున్న ప్రకారం రెట్టింపు చెల్లించడంతో నమ్మిన కాజీపేట ప్రశాంత్ నగర్‌కు చెందిన గుడిపాటి లక్ష్మీ, కరీమాబాద్‌కు చెందిన శ్రీలత అత్యాశతో కోటి 75 లక్షలు విలువ చేసే 48 తులాల బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదు కానిస్టేబుల్ కుటుంబానికి అప్పగించారు. అప్పగించేటప్పుడు అక్కచెల్లెళ్ల మాదిరిగా పిలుచుకుంటూ వీడియో తీసుకుని సంబరపడిపోయారు.
అయితే వారి సంబరం ఆదిలోనే ఆవిరైపోయింది. నగలు నగదు ముట్టజెప్పి రెండేళ్లు అవుతున్నా తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టాస్క్ ఫోర్స్ పోలీసుల తోపాటు కాజీపేట పోలీసులు రంగంలోకి దిగి చీటింగ్ రాకెట్‌ను ఛేదించారు. కానిస్టేబుల్‌తోపాటు ఆయన భార్యను వారికి సహకరించిన రాజబాబును అరెస్టు చేశారు. వారినుంచి రూ. 5,60,000 నగదు, రూ. లక్ష విలువ చేసే డైమండ్ చెవి దుద్దులు స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ, కాజీపేట పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. నగలు నగదు తీసుకుని రెట్టింపు ఇస్తామంటే నమ్మకూడదని, ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment