సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు జీహెచ్‌ఎంసీలో పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు అత్యుత్సాహంతో ముందుకు వచ్చేవారు. టెండర్ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసేవారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. బల్దియా పనులంటేనే కాంట్రాక్టర్లు జంకుతున్నారు. ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా స్పందించడం లేదు. దీనికి కారణం సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగకపోవడమేనని తెలుస్తోంది. నగరంలో వానొస్తే రోడ్లు చెరువులయ్యే పరిస్థితి తప్పించేందుకు..ముంపు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్‌ఎన్‌డీపీ) పేరిట ప్రత్యేక ప్రాజెక్ట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది.
వర్షాకాలం రాకముందే పలు పనులు చేయాలని భావించినప్పటికీ, వర్షాకాలం వచ్చేంతదాకా ఎలాంటి పనులు చేపట్టలేదు. జూన్‌లో కురిసిన వర్షాలతో పనులకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కొన్ని పనులకు టెండర్లు పిలిచారు. ఒక్కసారి కాదు..రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు రాకపోవడంతో పలు పనులకు మూడో పర్యాయం కూడా టెండర్లు పిలవాల్సి వస్తోంది. కళాసిగూడ నాలాపై మూడు ప్రాంతాల్లో నాలాల్ని విస్తరించి పైకప్పులు( బ్రిడ్జిలు) వేసే పనుల వ్యవహారమే ఇందుకు నిదర్శనం.
కళాసిగూడ నాలాపై రాణిగంజ్ బస్‌డిపో పక్కన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయం వద్ద, బుద్ధభవన్ నుంచి శ్మశానవాటిక రోడ్ మార్గంలో, మారియట్ హోటల్ వద్ద ట్యాంక్‌బండ్ రోడ్ నుంచి కవాడిగూడ వరకు మూడు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. వీటి అంచనా వ్యయం రూ.12.75 కోట్లు. రెండు పర్యాయాలు పిలిచినా టెండర్లు దాఖలు కాకపోవడంతో మూడో పర్యాయం కూడా పిలిచారు. వాటికి టెండర్లు దాఖలు చేయడానికి ఈనెల 23వ తేదీ వరకు గడువుంది. ఆలోగానైనా టెండర్లు దాఖలై పనులు జరుగుతాయో లేదో తెలియదు. ఆయా మార్గాల్లో పనులు చేయాలంటే ట్రాఫిక్ మళ్లింపు, యుటిలిటీస్ తరలింపు వంటి సమస్యల వల్ల కాంట్రాక్టర్లు వెనకడుగు వేసున్నారని అధికారులు చెబుతున్నారు.
జీహెచ్‌ఎంసీలో గతంలో మాదిరిగా పనులకు వెంటనే బిల్లుల చెల్లింపులు జరగడం లేదని, సిబ్బంది జీతభత్యాల చెల్లింపులకే నెలనెలా ఎదురవుతున్న ఇబ్బందులు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని పనులు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందని జీహెచ్‌ఎంసీలో ఎంతోకాలంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
ఎస్సార్‌డీపీకి అలా.. ఎస్‌ఎన్‌డీపీకి ఇలా..
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్సార్‌డీపీ) పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం బాండ్లు, లోన్ల ద్వారా నిధులు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీకి అనుమతినిచి్చంది. ఎస్‌ఎన్‌డీపీ పనులకు మాత్రం నివాస కేటగిరీలో ఉండి ఇటీవల వాణిజ్య కారిడార్లుగా మారిన 118 మార్గాల్లో టౌన్‌ప్లానింగ్ విభాగానికి వచ్చే ఇంపాక్ట్ ఫీజు నిధుల్ని ఎస్‌ఎన్‌డీపీకి వినియోగించేలా ఉత్తర్వు జారీ చేసింది. ఇంజనీరింగ్ నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులు దాదాపు రూ. 600 కోట్ల మేర పెండింగ్‌లో ఉండటంతో గత కొంతకాలంగా సంబంధిత కాంట్రాక్టర్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్కిళ్లలో పనులు కూడా చేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment