సాక్షి, హైదరాబాద్: ‘‘మీరు కోవిడ్–19 రెండో డోసు టీకాను విజయవంతంగా తీసుకున్నారు. మీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కోసం నిర్దేశించిన లింకును క్లిక్ చేయగలరు..’’ అంటూ వస్తున్న ఎస్సెమ్మెస్‌లతో ఇప్పటికి కేవలం మొదటి డోసు టీకా మాత్రమే తీసుకున్నవారు విస్తుపోతున్నారు. తాము రెండో డోసు టీకా తీసుకోకున్నా తమ ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ ఎందుకు వస్తోందో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
పైగా వ్యాక్సినేషన్ పూర్తయినట్లు లింక్ సైతం వస్తుండటం, సర్టిఫికెట్ కూడా డౌన్‌లోడ్ అవుతుండటంతో గందరగోళంలో పడిపోతున్నారు. ఆన్‌లైన్ ఎంట్రీ కావడంతో తాము రెండో డోసు వేసుకునే అవకాశం ఉంటుందా? లేదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు లబ్ధిదారులు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదిస్తుండడం గమనార్హం. ఈ ఎస్సెమ్మెస్‌లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
గడువు దాటినా తీసుకోకపోవడంతో..
రాష్ట్రంలో ఇప్పటివరకు 3,61,10,669 మంది కరోనా టీకాలు తీసుకున్నారు. ఇందులో మొదటి డోసు 2,42,24,911 మంది తీసుకోగా... రెండు డోసులు తీసుకున్నవారు 1,18,85,758 మంది ఉన్నారు. 3,22,02,104 మంది ప్రభుత్వ కేంద్రాల్లో టీకాలు తీసుకోగా, 39,08,565 మంది ప్రైవేటు కేంద్రాల్లో తీసుకున్నారు. కోవాగ్జిన్ టీకా మొదటి డోసు తీసుకున్నవారు 6 నుంచి 8 వారాల గడువులో రెండో డోసు తీసుకోవాలి.
కోవిషీల్డ్ తీసుకుంటే 12 నుంచి 16 వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. రాష్ట్రంలో 80 శాతం మంది కోవిషీల్డ్ టీకాలే తీసుకున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన గడువు దాటినప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని వారు దాదాపు 20 లక్షల మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రెండో డోసు గడువు తీరడంతో వారంతా రెండోసారి టీకా తీసుకున్నట్లుగా భావించి వెబ్‌సైట్‌లో ఎంట్రీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రెండోడోసు తీసుకోనివారికి టీకా
రెండో డోసు తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేసిన వారిని గుర్తించి టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయి నుంచి పెద్దగా స్పందన లేదు. అందువల్ల వారంతా రెండో డోసు తీసుకుని ఉంటారనే భావనతో ఈమేరకు ఆన్‌లైన్‌ఎంట్రీలు జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్ ఎంట్రీ అయినప్పటికీ రెండో డోసు తీసుకోనివారు వస్తే తప్పకుండా వ్యాక్సిన్ అందిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment