సాక్షి, మంచిర్యాలటౌన్: ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే గర్భం దాల్చిన వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. కరోనా వల్ల సరైన సమయంలో గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లలేక పోతున్నారు. వైద్యులను ఫోన్‌లో సంప్రదించి వారికి ఉన్న సమస్యను వివరించి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. కానీ కొందరు ప్రసవానికి దగ్గర పడుతుండడం, కొందరికి కరోనా సోకడం వల్ల ఏమి చేయాలనేదానిపై ఎన్నో సందేహాలు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై జిల్లా ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్ రాధిక పలు సూచనలు చేస్తున్నారు.
అధైర్య పడొద్దు..
కరోనా రాకుండా ముందస్తుగానే గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కరోనా వచ్చిన అధైర్యపడకుండా, వైద్యుల సూచనల మేరకు తగిన మందులను వాడితే సరిపోతుంది. ప్రసవం సమయంలో కోవిడ్ పాజిటివ్ వస్తే, అలాంటి వారికి ప్రత్యేకంగా సాధారణ ప్రసవం గానీ, ఆపరేషన్ ద్వారా ప్రసవం చేస్తున్నారు. ప్రైవేటులో కరోనా సోకిన వారికి ప్రసవం చేయడానికి ఇబ్బందులకు గురిచేస్తుండగా, జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్‌తో వచ్చిన వారిలో 14 మందికి అక్కడ పనిచేస్తున్న గైనకాలజిస్టులు సిజేరియన్, సాధారణ ప్రసవాలను చేశారు. గర్భం దాల్చిన వారు కరోనా రాకుండా ఉండేందుకు బయటకు వెళ్లకుండా ఉంటూనే, ఇంట్లో కూడా మాస్క్‌ను తప్పనిసరిగా ధరించి, సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. ఇంట్లో ప్రత్యేక గదిలోనే ఉంటూ, నీరు ఎక్కువగా తీసుకోవాలి.
లక్షణాలు ఉంటే టెస్టు తప్పదు..
ఎవరికైనా కోవిడ్ వచ్చిందంటే జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, వాంతులు, విరేచనాలు వంటివి వస్తే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే మందులను కూడా వాడాలి. కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకున్నప్పుడు, పాజిటివ్‌గా వస్తే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. గర్భం దాల్చిన తరువా త 4 నెలలకు గానీ కరోనా వ్యాక్సిన్‌ను వేసుకోవద్దు. గర్భం దాల్చినట్లుగా తెలిసిన వెంటనే వైద్యుల సమక్షంలో చెకప్ చేసుకుని 7 నెలల వరకు నెలకు ఒకసారి, 7–9 నెలల మధ్యలో 15 రోజులకు ఒకసారి, 9 నెలలు పడ్డాక వారానికి ఒకసారి వైద్యులను సప్రదించాలి.
ప్రస్తుత సమయంలో కోవిడ్ ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకుని ఆసుపత్రికి వెళ్లాలి. గర్భి ణులకు వైద్య పరీక్షలను చేయించడంలో ఆశ కార్యకర్తలదే కీలకపాత్ర. కరోనా వచ్చిన వారికి ప్రసవం చేసినా అందులోని బిడ్డకు కరోనా వచ్చేందుకు అవకాశం లేదు. గర్భిణులకు పాజిటివ్‌గా వస్తే మాత్రం వారిలో ఉన్న జ్వర తీవ్రతను బట్టి మందులు, యాంటీబాడీస్ ట్యాబ్లెట్లను వాడాలి. నాలుగు రోజు ల తరువాత కూడా జ్వరం ఉంటేనే కరోనా టెస్టుకు వెళ్లాలి. కరోనా వచ్చినా, రాకపోయినా, ధైర్యంగా ఉంటూ, పూర్తి పౌష్టికాహారం తీసుకోవాలి.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
కోవిడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భిణుల్లో మాత్రం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వారిని తొమ్మిది నెలల పాటు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కోవిడ్ సోకిన వారు సైతం ఎలాంటి భయబ్రాంతులకు గురికాకుండా ఉండాలి. మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, సరిపడా నీరు తాగాలి.
– డాక్టర్ రాధిక, గైనకాలజిస్టు, జిల్లా ఆసుపత్రి
వైద్య పరీక్షలు చేయిస్తున్నాం..
గర్భం దాల్చిన నాటి నుంచే వారికి పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, వారికి 7 నెలలు నిండే వరకు స్థానిక పీహెచ్‌సీలో వైద్య పరీక్షలను నెలలో ఒకసారి చేయిస్తున్నాం. 7 నెలలు నిండగానే వారికి జిల్లా ఆసుపత్రిలో నెలలో ఒకసారి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. గర్భిణులను ప్రతి నెలా ఆసుపత్రులకు తీసుకెళ్లి, తీసుకురావడం ఇబ్బందిగా ఉన్నా, కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నాం.
– కృష్ణవేణి, ఆశ కార్యకర్త, లక్సెట్టిపేట్ మండలం
చదవండి: ఇంట్లో ఒంటరిగా ముగ్గురు పిల్లలు; నిజమైన హీరోలు మీరే!
Comments
Please login to add a commentAdd a comment