ఒక్కరోజులో నాలుగు కరోనా కేసులు  | corona will come again in telangana | Sakshi
Sakshi News home page

ఒక్కరోజులో నాలుగు కరోనా కేసులు 

Published Wed, Dec 20 2023 4:12 AM | Last Updated on Wed, Dec 20 2023 7:40 AM

corona will come again in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే ఏకంగా నాలు­గు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 402 మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా నలుగురికి వైరస్‌ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు కోవిడ్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కాగా గత వారం రోజుల్లో ఐదు కరోనా కేసులు నమోద­య్యాయి.

బాధితులు అందరూ ఐసోలేషన్‌ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో పలు ప్రాంతాల్లో నమోదైన కేసులు... కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందిన జేఎన్‌1 సబ్‌ వేరియంట్‌వని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో నమోద­య్యే కేసుల్లో ఈ వేరియంట్‌వి ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కరోనాపై మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అత్యవసర సమీక్ష నిర్వహించారు. 

అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలి
కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గత అనుభవంతో పరిస్థితులను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలనీ మాక్‌డ్రిల్‌ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో స్పెషల్‌ వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల పరిస్థితిపై ప్రభుత్వం నివేదిక కోరింది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌లోని జేఎన్‌ 1 వైరస్‌ పరిస్థితిపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సమగ్ర సమాచారం అందజేశారు. 

భయపడాల్సిన అవసరం లేదన్న అధికారులు 
ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని మంత్రికి అధికారులు వివరించారు. అయితే ఇతర దేశాల్లో కేసులు పెరిగినందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు విరివిగా నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. బుధవారం నుంచి పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహించాలని భావిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇళ్లల్లో వారిని ఐసోలేషన్‌లో ఉంచడం వల్ల ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు. 

మాస్క్లు అవసరం లేదు కానీ... 
మాస్క్లు ధరించాల్సిన ప్రత్యేక అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కరోనా కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ సబ్‌ వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయని,  కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement