సాక్షి, హైదరాబాద్: ఇకపై విమాన ప్రయాణం చేయాలంటే యాంటిజెన్ పరీక్ష తప్పనిసరి. కరోనా లక్షణాలు లేనివారినే విమానంలోకి అనుమతిం చాలని భావిస్తున్న పౌర విమానయాన సంస్థ ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ అందు లో పాజిటివ్‌గా తేలితే ప్రయాణాలను రద్దు చేసేలా ఆంక్షలు విధించేటట్లు ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. లాక్‌డౌన్ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి చేసినట్లుగానే దేశీయ ప్రయాణాల్లో ‘యాంటిజెన్ ’ను తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.
సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా ఇప్పటికే వందల విమానాలు రద్దయ్యాయి. కొందరు ప్రయాణికులు స్వచ్ఛందంగానే తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్‌డౌన్ నిబంధనలు, కర్ఫ్యూల వంటి వాటితో కూడా రాకపోక లు స్తంభించాయి. ఈ క్రమంలోనే విమానం బయలుదేరడానికి ముందు యాంటిజెన్ పరీక్ష చేసుకుంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ‘మ్యాప్ మై జీనోమ్’ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించనున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ వంటివి అమలు చేస్తున్నట్లుగానే ఇక నుంచి ‘యాంటిజెన్ ’కూడా తప్పనిసరి చేయనున్నారు. విదేశీ ప్రయాణాలకు మాత్రం 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాలనే నిబంధన ఉంది. ప్రామాణికమైన ల్యాబొరేటరీల్లో చేసే పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
200 విమానాలు రద్దు...
కోవిడ్ సెకండ్ వేవ్‌తో విమానాల రాకపోకలు స్తం భించాయి. హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలు ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. రోజుకు 30 నుంచి 40 విమానాల వరకు రద్దవుతున్నట్లు అధికారులు తెలిపారు. వారంలో సుమారు 200లకు పైగా డొమెస్టిక్ విమానాలు రద్దయ్యాయి. సెకండ్ వేవ్‌కు ముందు దేశవ్యాప్తంగా 70 నగరాలకు హైద రాబాద్ నుంచి ప్రతి రోజు 330 విమానాలు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు వీటి సంఖ్య 250కి తగ్గింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో నెలకు లక్ష మంది ప్రయాణించారు. మార్చి నుంచి క్రమంగా రద్దీ తగ్గుతూ.. ఏప్రిల్‌లో బాగా పడిపోయింది.
గత నెల 40 నుంచి 50 వేల మంది ప్రయాణించి ఉండవచ్చునని అంచనా. మే నెల ఆరంభం నుంచి రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు సైతం ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాల దృష్ట్యా రాకపోకలు సాగించేవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ‘సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి, వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తే రాకపోకలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవచ్చు. కానీ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా యాంటిజెన్ టెస్ట్ తప్పనిసరిగా ఉంటుంది’ అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.
చదవండి: కరోనా: ఐవర్‌మెక్టిన్‌తో తగ్గుతున్న మరణాల ముప్పు!
Comments
Please login to add a commentAdd a comment