మైక్రో బయాలజీలో డాక్టరేట్ ఎ.వేణుగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైరస్‌లు మ్యుటేట్ చెందడం కొత్త కాదని, ప్రపంచంలోని ప్రతి వైరస్ కూడా మ్యుటేట్ చెందుతూనే ఉంటుందని మైక్రోబయాలజీలో డాక్టరేట్, వీణవంక మండలం టీఎస్ మోడల్ హైస్కూల్ ప్రిన్సిపాల్ ఎ. వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. వైరస్‌లు కొత్త రకాలుగా మార్పు చెందుతూనే ఉంటాయని వాటినే వేరియెంట్లుగా పిలుస్తున్నామన్నారు. ఒకవేళ భారీ వేరియెంట్లు ఏమైనా వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా ప్రతి 6 నెలలు లేదా ఏడాదికి ఒకసారి వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌లు వేసుకుంటే సరిపోతుందన్నారు. వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో వేస్తే 2024 కల్లా వైరస్ పూర్తిగా కనుమరుగు అవుతుందని ఆయన చెప్పారు. మ్యుటేట్ అయిన ప్రతిసారీ వైరస్‌కే లబ్ధి చెందుతుందనే గ్యారంటీ లేదని, వందసార్లు మ్యుటేట్ అయితే ఒకసారే దానికి ప్రయోజనం కలగొచ్చని విశ్లేషించారు.
ఈ క్రమంలో వైరస్ శక్తి కూడా క్షీణిస్తుంది కాబట్టి కొత్త వేరియెంట్లు వస్తే ఏదో జరిగిపోతుందని అనవసర భయాలు పెట్టుకోవద్దని సూచించారు. మ్యుటేషన్‌లు అనేవి డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ కలిగి ప్రాణమున్న ప్రతి జీవిలో (లివింగ్ ఆర్గానిజం) ఏర్పడతాయి. ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లలో మ్యుటేషన్లు వేగంగా సంభవిస్తాయని తెలిపారు. కరోనా థర్డ్ వేవ్‌లో ఇంటికో మరణం సంభవిస్తుందన్న ప్రచారాలను, కొత్త వేరియెంట్లపై వ్యాక్సిన్లు పనిచేయకపోతే భారీగా ప్రాణ నష్టం జరుగుతుందన్న వదంతులను నమ్మొద్దని కోరారు.
ఏ వైరల్ ఇన్ఫెక్షన్లు చూసినా ఒకట్రెండు వేవ్‌లతోనే పోలేదని, అందువల్ల కరోనా థర్డ్ వేవ్ లేదా మరికొన్ని వేవ్‌లు వచ్చినా ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రక్షణ పొందొచ్చని చెప్పారు. తద్వారా ఇప్పుడున్న వేరియెంట్లను, రాబోయే వేరియెంట్లను సమర్థంగా ఎదుర్కోవచ్చునన్నారు. రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుకోగలిగితే ఎన్ని రకాల వేరియెంట్లు వచ్చినా ఎదుర్కోవచ్చునన్నారు. ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలపై ‘సాక్షి’తో ఆయన అభిప్రాయాలు పంచుకున్నారు.
ప్రశ్న: ఇన్నేట్ ఇమ్యూనిటీతో రక్షణ ఏర్పడుతుందా?
జవాబు: శరీరంలో ముందుగా రక్షణ వలయం లేదా కవచంగా నిలిచే ఇన్నేట్ ఇమ్యూనిటీ కరోనా లేదా ఇన్‌ఫ్లుయెంజా అనే దానితో సంబంధం లేకుండా అడ్డుకుంటుంది. అందువల్లే 50–60 శాతం మంది ఎలాంటి రక్షణ లేకపోయినా తట్టుకోగలుగుతారు. ప్రస్తుత సార్స్–సీవోవీ–2 కంటే ముందు కరోనాకు సంబంధించిన ఐదు రకాల వైరస్‌లు ఇప్పటికే మనకు చాలాసార్లు సోకి ఉంటాయి. వాటి ప్రభావంతో శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీస్, టీ–లింఫోసైట్స్ కూడా ప్రస్తుత కరోనాపై పనిచేస్తున్నాయనడానికి శాస్త్రీయ ఆధారాలున్నాయి.
ప్రశ్న: కొత్త వేరియెంట్ ఆలస్యమైతే థర్డ్ వేవ్ తీవ్రత తగ్గుతుందా?
జవాబు: ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీ కూడా బాగానే ఏర్పడుతోంది. వైరస్ సోకినా లక్షణాలు కనిపించని వారు ఎక్కువ మందిలో యాంటీబాడీస్ ఏర్పడ్డాయి. మార్పులు చెందిన వేరియెంట్ ఎప్పుడు వస్తుందనే దానిపై థర్డ్ వేవ్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ వేరియెంట్ ఇప్పట్లో రాకపోతే నవంబర్, డిసెంబర్ దాకా ఇబ్బంది ఉండదు. ఇలా మూడో దశ కొంత కాలం వాయిదా పడితే ఈ ఏడాది చివరి దాకా 60–70 శాతం మందికి వ్యాక్సిన్లు వేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కొత్త వేరియెంట్లు వచ్చినా ఎక్కువ మందికి వైరస్ సోకకపోవడం వల్ల మనకు పెద్దగా ప్రమాదం ఉండదు. థర్డ్ వేవ్ తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది.
ప్రశ్న: వేరియెంట్లను గుర్తించడానికి ఏం చేయాలి?
జవాబు: క్రమం తప్పకుండా ‘ర్యాండమ్ జీనోమ్ సీక్వెన్సింగ్’ నిర్వహించాలి. తద్వారా సమూహంలో పాత వైరసే వ్యాప్తిలో ఉందా లేక కొత్త వేరియెంట్లు ఏమైనా వచ్చాయా అన్నది తెలుస్తుంది. దీనిపై ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలి. అలాగే కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడం ద్వారా కేసులు, వ్యాప్తిపై స్పష్టత వస్తుంది.
ప్రశ్న: బూస్టర్ డోస్‌లు తీసుకోవాల్సి ఉంటుందా?
జవాబు: టీకా తీసుకున్నాక అది రోగనిరోధక వ్యవస్థను చైతన్యపరిచి యాంటీబాడీస్, లింఫోసైట్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలోకి ప్రవేశించాక ఈ వ్యవస్థను వైరస్ తప్పించుకునే క్రమంలో ఇమ్యూనో ఎస్కేప్ లేదా వ్యాక్సిన్ ఎస్కేప్ మ్యూటెంట్లు ఏర్పడవచ్చు. అయితే ఇప్పటి వ్యాక్సిన్లు కొత్త వేరియెం ట్లపై 100% పనిచేయకపోయినా కనీసం 60–70 శాతమైతే సమర్థంగా పనిచేస్తాయి. వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా సోకితే స్వల్ప, ఒక మోస్తరు ప్రభావం మాత్రమే పడుతుంది. అదీగాక భారీ వేరియెంట్ అనేది వచ్చినా దానికి తగ్గట్టుగా వ్యాక్సిన్లలోని స్పైక్ ప్రోటీన్‌నో, ఇంకో దాన్నో ఇందులో చేర్చుతారు. అయితే ప్రతి 6 నెలలు లేదా ఏడాదికి ఒకసారి వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌లు వేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో వేస్తే 2024 కల్లా వైరస్ పూర్తిగా కనుమరుగవుతుంది.
చదవండి: పదిరోజుల్లో మారాలి: సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment