సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, భారీ చోరీలు వంటి సంచలనాత్మక నేరాలు నమోదవుతూనే ఉంటాయి. వీటిని నిత్యం చూస్తూనే ఉంటాం. వీటితో పాటు అంతగా ప్రాచుర్యానికి నోచుకోని వెరైటీ నేరాలు కూడా నమోదవుతూ ఉంటాయి. కొన్ని కేసులను తమ విధుల్లో భాగమనుకుంటూ పోలీసులు ఇష్టంతో చేసినా.. ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటూ కష్టంగా భావించినా ఈ తరహా కేసుల్నీ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. వీటిలో అత్యధికం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఠాణాల పరిధిలో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది చోటు చేసుకున్న వాటిలో ఈ కోవలోకి వచ్చే కేసుల్లో కొన్ని...
తనది పోయిందని మరొకరిది..
సాధారణంగా ఎవరైనా తమ వస్తువు పోతే వీలున్నంత వరకు వెతికి విలువైనది అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లేని పక్షంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని వదిలేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మూల సునీల్ కుమార్ తన బ్యాగ్ పోయినందుకు మరోటి చోరీ చేసి చిక్కాడు. ఇతగాడు రైల్లో వస్తూ తన బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఈ నష్టం పూడ్చుకునేందుకు విజయనగరం నుంచి వచ్చిన శివశంకర్ అనే వ్యక్తిది చోరీ చేశాడు. బాధితుడు రైల్వే పోలీసులను ఆశ్రయించడంతో సీసీ కెమెరాల ఆధారంగా చిక్కి జైలుకు వెళ్లాడు.
నేరం చేస్తుండగా నిద్రొచ్చేసింది..
ఓ టార్గెట్‌ను ఎంచుకుని అక్కడ చోరీ చేయాలని భావించిన దొంగలు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తారు. రెక్కీ తర్వాత ‘పని’లోకి దిగి చడీచప్పుడు కాకుండా పూర్తి చేస్తారు. ఆపై ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఉడాయించేస్తారు. అయితే చాంద్రాయణగుట్ట పరిధిలోని ఆలయంలో చోరీ చేసిన బాలుడు మాత్రం అందులోనే బజ్జుని చిక్కాడు. ఓ బాలుడు శ్రీశైలం రహదారిపై ఉన్న శ్రీరామాలయంలో చోరీకి వచ్చాడు. అర్థరాత్రి శ్లాబ్ నుంచి మెట్ల మార్గంలో లోపలకు ప్రవేశించాడు. అక్కడి హుండీ, అల్మారా తాళాలు పగులకొట్టి సొత్తును సంచిలో వేసుకున్నాడు. ఇంత వరకు అంతా అతడు అనుకు న్నట్లే జరిగినా... ఈ పనితో అలసిపోయాడో ఏమో అక్కడే నిద్రపోయాడు. ఉదయం వచ్చిన పూజారి బాలుడిని, అతడితో ఉన్న సంచిలో సొత్తును చూసి పోలీసులకు అప్పగించాడు.
మూత్రం తెచ్చిన తంటా..
దేవరకొండ బస్తీలో మూత్ర విసర్జన రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ బస్తీకి చెందిన ఓ యువకుడు ఓ రోజు రాత్రి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేస్తున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఇతడిని మందలించాడు. ఇరువురి మధ్యా మాటామాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. కొద్దిసేపటికే ఇద్దరి స్నేహితులూ అక్కడకు చేరుకుని రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఇది పరస్పర దాడుల వరకు వెళ్లింది. విషయం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరడంతో రెండు వర్గాలకు చెందిన 17 మందిపై కేసు నమోదైంది.
కాస్త అడ్వాన్స్ అయ్యాడు..
పెళ్లైన కొన్నేళ్ల తర్వాత నుంచో భార్యలకు భర్తలు, అత్తింటి వారి నుంచి వరకట్న వే«ధింపులు ఎదురైన కేసులు ఎన్నో చూస్తుంటాం. అయితే కర్నూలు జిల్లాకు చెందిన మనోజ్‌కుమార్‌రెడ్డి మాత్రం ‘అడ్వాన్స్’ అయిపోయాడు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా కేపీహెచ్‌బీ రెండో ఫేజ్‌కు చెందిన యువతితో వివాహం కుదిరింది. ఐదెకరాల భూమి, మరో రూ.25 లక్షల విలువైన స్థలం కట్నంగా ఇచ్చేలా ఒప్పందం తర్వాత నిశ్చితార్థం కూడా జరిగింది. కర్ణాటకలోని బేలూరులో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఇతడి మనస్సు పెళ్లికి ముందే మారిపోయింది. అదనంగా ఐదెకరాలు ఇస్తేనే తాళి కడతానంటూ యువతితో పాటు ఆమె తల్లిదండ్రులనూ ఫోన్ ద్వారా వేధిస్తూ బెదిరింపులకు దిగాడు. ఫిర్యాదుతో చివరకు జైలు గడప తొక్కాడు.
భయపడి బాత్‌రూమ్‌లో పడేశాడు..
నగదు, సొత్తు చోరీ చేసిన దొంగలు దాన్ని తమతో పట్టుకుపోతారు. ఆనక జల్సాలు, అవసరాలకు ఖర్చు చేసుకుంటారు. అయితే జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రకాష్ ఇంట్లో చోరీ చేసిన క్యాటరింగ్ బాయ్ మాత్రం ఆ మొత్తాన్ని కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు. దీపావళి సందర్భంగా ప్రకాష్ రూ.3.5 లక్షలు అమ్మవారి ఎదుట ఉంచి పూజించాడు. ఆ ఫంక్షన్‌కు క్యాటరింగ్ బాయ్‌గా వచ్చిన షేక్ చాంద్ రజాక్ ఆ మొత్తాన్ని జేబులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటికి డబ్బు పోయిన విషయం గుర్తించిన యజమాని తనిఖీలు మొదలెట్టారు. దీంతో తాను చిక్కుతానని భయపడిన రజాక్ బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. రూ.75 వేలు జేబులో ఉంచుకుని మిగతా మొత్తం కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు. జేబులో ఉన్న డబ్బుతోనే చిక్కిన అత గాడు ఆరా తీస్తే అసలు విషయం చెప్పాడు.
అదృశ్యాలు తట్టుకోలేక ‘ఆమె’గా మార్చారు..
యువతిగా మారాలన్న తన కోరికను కుటుంబీకులు అంగీకరించట్లేదనే ఉద్దేశంలో షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదేపదే ‘అదృశ్యం’ అవుతున్నాడు. ఎట్టకేలకు ఈ అంశం సైబరాబాద్ ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్‌డెస్క్ వద్దకు వచ్చింది. అతడి ఆచూకీ కనిపెట్టిన అధికారులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అంతటితో ఆగకుండా కుటుంబీకులకు కౌన్సెలింగ్ చేసి అతడి కోరిక తీరేలా చేశారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదో తరగతిలో ఉండగానే యువతిగా మారాలని భావించాడు. తన కోరికను తల్లిదండ్రులకు చెప్పగా వాళ్లు ససేమిరా అన్నారు.
దీంతో రెండుమూడుసార్లు ఇల్లు విడిచి పారిపోయిన అతగాడు ట్రాన్స్‌జెండర్స్ గ్రూపుల్లో చేరుతున్నాడు. విషయం గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్ డెస్క్‌కు చేరింది. సిద్ధిపేటలో అతడిని గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. యువతిగా మారాలన్న కోరిక తీరకపోతే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని పరిణామాలకు దారితీసే ఆస్కారం ఉందని గుర్తించారు. తల్లిదండ్రులకు హెల్ప్ డెస్క్ కౌన్సెలింగ్ చేసి వారి కుమారుడి కోరికను మన్నించేలా చేశారు.
రాజీ కోసం చోరీ..
గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకున్న కొన్ని నేరాలు పోలీసుల వరకు రావు. పెద్దల సమక్షంలో జరిగే పంచాయితీల్లోనే సెటిల్ అవుతుంటాయి. చోరీ కేసులో ఇలాంటి ఓ సెటిల్‌మెంట్‌కు సంబంధించిన సొమ్ము చెల్లించడానికి నగరానికి వచ్చి చోరీ చేసి చిక్కాడో ప్రబుద్ధుడు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలం, సత్యగామకు చెందిన నాగరాజు ఆ గ్రామంలో ఓ చోరీ చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తానంటూ అంగీకరించాడు. ఆ డబ్బుతో పాటు తనకూ కొంత మిగలాలనే ఉద్దేశంతో సిటీకి వచ్చి చోరీ చేయాలని భావించాడు. నగరానికి వచ్చి బంజారాహిల్స్‌లోని ఓ దేవాలయంలో పూజారిగా చేరాడు. అక్కడికి వచ్చిన ఓ బాధితురాలి ఇబ్బందులు తొలగిస్తానని నమ్మబలికాడు. అందుకు అవసరమైన పూజ కోసం బంగారం ఇస్తే పూర్తయిన తర్వాత మరో తు లం కలిపి ఇస్తానంటూ నమ్మించాడు. ఇలా ఆమె నుంచి బంగారం, వెండి తీసుకుని పారి పోయాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment