తేలని మిల్లర్ల నూకల పరిహారం  | CS Committee on Farina Compensation for Yasangi Grain Milling for Millers | Sakshi
Sakshi News home page

తేలని మిల్లర్ల నూకల పరిహారం 

Published Fri, May 6 2022 1:46 AM | Last Updated on Fri, May 6 2022 1:48 AM

CS Committee on Farina Compensation for Yasangi Grain Milling for Millers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘యాసంగిలో పండే ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్‌ చేస్తే నూకల శాతం పెరుగుతుంది. తద్వారా మిల్లర్లకు నష్టం జరుగకుండా పరిహారం చెల్లిస్తాం. సీఎస్‌ కమిటీ టెస్ట్‌ మిల్లింగ్, నష్టపరిహారంపై తుది నిర్ణయం తీసుకుంటుంది.’
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి 
గంగుల కమలాకర్‌ ప్రకటన ఇది.  


కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కొన్నేళ్లుగా ఉప్పుడు బియ్యంగా మిల్లింగ్‌ చేస్తున్న యాసంగి ధాన్యాన్ని ఈసారి ముడిబియ్యంగా ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన పరిస్థితి. గతనెల 12న సీఎం కేసీఆర్‌ యాసంగి పంటను సర్కారే కొనుగోలు చేస్తుందని ప్రకటించి, ముడిబియ్యం మిల్లింగ్‌తో జరిగే నష్టాన్ని సైతం భరిస్తామని ప్రకటించారు. నూకల నష్టం అంచనాకు సీఎస్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. సీఎం ప్రకటన తరువాత మంత్రి గంగుల.. మిల్లర్లతో సమావేశమై కొనుగోలు కేం ద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దించుకోవాలని చెప్పారు. కానీ, ఇప్పటివరకు సీఎస్‌ కమిటీ మిల్లర్లకు పరిహారంపై నిర్ణయం తీసుకోలేదు. సీఎస్‌ కమిటీ వారం క్రితం సమావేశమైనా.. నూకలకు నష్టపరిహారం ఎంతివ్వాలనేది స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే 5 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్లు సేకరించారు. ఈ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం మిల్లింగ్‌కు వస్తుందని అంచనా. ప్రస్తుతం మిల్లుల్లో వానాకాలం ధాన్యం మిల్లింగ్‌ జరుగుతుండగా, కొద్దిరోజుల్లో యాసంగి ధాన్యాన్ని మరపట్టించాల్సి ఉంది. ఇప్పటికీ మిల్లింగ్‌ చార్జీలు, పరిహారం గురించి కమిటీ నిర్ణయం తీసుకోకపోవడం పట్ల మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం మిల్లులకు చేరాక సర్కార్‌ చేతులెత్తేస్తే తమ పరిస్థితి ఏంటని కరీంనగర్‌కు చెందిన ఓ మిల్లర్‌ వ్యాఖ్యానించాడు. సీఎస్‌ కమిటీ పరిహారం ప్రకటించాలని, లేనిపక్షంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు పేర్కొన్నారు. 

సర్కార్‌ ఆఫర్‌ రూ.150.. మిల్లర్ల డిమాండ్‌ రూ.300: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు అధికం. ఈ క్రమంలో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే బియ్యం విరిగి నూకలుగా మారతాయి. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం.. ‘కస్టమ్‌ మిల్లింగ్‌ ’విధానంలో క్వింటాలు ధాన్యాన్ని మరపట్టిస్తే 67 కిలోల బియ్యం రావాలి. సెంట్రల్‌ పూల్‌ కింద క్వింటాలు ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని సేకరించి, తదనుగుణంగా కనీస మద్దతు ధర రూ.1,960 రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చిన తరువాత రీయింబర్స్‌మెంట్‌ రూపంలో కేంద్రం నుంచి తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యం ముడిబియ్యంగా మారిస్తే వచ్చే నూకల నష్టాన్ని రాష్ట్రమే భరించాలి. ఈ నూకల నష్టం అంచనాకు సీఎస్‌ కమిటీ జిల్లాల వారీగా టెస్ట్‌ మిల్లింగ్‌ చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌లో నూకల శాతం అత్యధికంగా ఉండగా, ఇతర జిల్లాల్లో కొంత తక్కువగా ఉంటుంది. క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే వచ్చే నూకల శాతాన్ని లెక్కించి సగటున రూ.300 ఇవ్వాలని మిల్లర్లు కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం రూ.150 ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. ఒకవైపు ఎఫ్‌సీఐ అధికారులు ప్రత్యక్ష తనిఖీల పేరుతో భయబ్రాంతులను చేస్తుండగా, మరోవైపు యాసంగి ధాన్యం షరతులు లేకుండా కొనుగోలు చేయాలని మంత్రి అల్టిమేటం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో పరిహారం ఎంతో తేల్చకుంటే నష్టపోతామని మిల్లర్లు చెబుతున్నారు. కాగా సీఎస్‌ గురువారం పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో సమావేశమై కొనుగోలు విధానంపై సమీక్షించారే తప్ప మిల్లర్లకు పరిహారంపై ప్రకటన చేయలేదు. ఇలాగైతే యాసంగి కొనుగోళ్లకు మిల్లర్లు కొర్రీలు పెట్టే అవకాశం ఉందని జిల్లాల్లో అధికారులు ఆందోళన చెందుతున్నారు.   

రైతుల చెల్లింపుల కోసం రూ. 5 వేల కోట్లు 
సాక్షి, హైదరాబాద్‌:
ధాన్యం సేకరణకు నిధుల సమస్య లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్మును రైతుల ఖాతాలో వేసేందుకు రూ.5 వేల కోట్లను ప్రభు త్వం కేటాయించిందన్నారు. యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై బీఆర్కేఆర్‌ భవన్‌లో ఆయన గురువారం పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సాగేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 61,300 మంది రైతుల నుంచి 4.61 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 3,679 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎస్‌ చెప్పారు., 

అందుబాటులో 7.80 కోట్ల గన్నీబ్యాగులు 
రాష్ట్రంలో 7.80కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటు లో ఉన్నాయని సోమేశ్‌ తెలిపారు. మరో 8 కోట్ల గన్నీబ్యాగుల కొనుగోలు కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి కావచ్చిందన్నారు. మరో రెండున్నర కోట్ల గన్నీ బ్యాగులు జ్యూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండి యా నుంచి రానున్నాయని చెప్పారు. కోనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా 17 జిల్లాల సరిహద్దుల్లో 51 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోకి... 
రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలిచ్చినట్లు సీఎస్‌ తెలిపారు. తద్వారా రైతులకు చెల్లింపులు త్వరితగతిన అవుతాయన్నారు. ఇప్పటివరకు 4.3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు చేరిందని తెలిపారు. వరంగల్, గద్వాల్, వనపర్తి, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వరి కోతలు ఆలస్యమవుతాయని, కోతలు ప్రారంభం కాగానే ఆయా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతాయని చెప్పారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement