రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు.. న్యూడ్‌ వీడియోలతో ఎర.. టీనేజర్లే టార్గెట్‌ | Cyber Frauds Target Teenagers | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు.. న్యూడ్‌ వీడియోలతో ఎర.. టీనేజర్లే టార్గెట్‌

Published Thu, Sep 29 2022 4:45 AM | Last Updated on Thu, Sep 29 2022 4:45 AM

Cyber Frauds Target Teenagers - Sakshi

హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి మధుకర్‌ (పేరు మార్చాము)కు ఫేస్‌బుక్‌లోని మెసెంజర్‌ ద్వారా వీడియో కాల్‌ వచ్చింది. ఆన్సర్‌ చేశాడు. వెంటనే అవతలి వైపు నుంచి ఓ చైల్డ్‌ న్యూడ్‌ వీడియో ప్లే అయ్యింది. దాని తర్వాత ఓ యూట్యూబ్‌ లింకు అతని ఫేస్‌బుక్‌ మెసెంజర్‌కు వచ్చింది. అది ఓపెన్‌ చేయగానే తాను వీడియో చూస్తున్నట్టు స్క్రీన్‌ రికార్డు ద్వారా రికార్డు చేసిన వీడియో కన్పించింది.

దీనితో కంగారుపడిన మధుకర్‌ మెసెంజర్‌లో అవతలి వైపు ఉన్న సైబర్‌ నేరస్తుడితో చాట్‌ చేస్తూ వీడియో తీసెయ్యాలని బతిమిలాడాడు. రూ.5 వేలు పంపిస్తే తీసేస్తామని బెదిరింపులకు దిగడంతో ఫోన్‌ పే ద్వారా ఒక నంబర్‌కు పంపాడు, అలా మొదలైన బ్లాక్‌మెయిలింగ్‌ రూ.1.2 లక్షలకు చేరడంతో చివరకు వాళ్ల అన్నకు విషయం చెప్పాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆ వీడియో లింకును యూట్యూబ్‌ నుంచి తొలగించారు.  

సాక్షి, హైదరాబాద్‌: టీనేజర్ల బలహీనత సైబర్‌ నేరస్తులకు కాసుల వర్షం కురిపిస్తోంది. సైబర్‌ నేరగాళ్లు వారిని లక్ష్యంగా చేసుకొని అశ్లీల వీడియోల ఆధారంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. దేశంలో ప్రతి ఏటా నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో ఈ తరహా పోర్నోగ్రఫీ బ్లాక్‌ మెయిలింగ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇంటర్, ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులను టార్గెట్‌ చేసుకుని సైబర్‌ నేరగాళ్లు వల వేస్తున్నారు.

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా, టిండర్, టెలిగ్రామ్‌ తదితర సోషల్‌ నెట్‌వర్క్, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పోర్నోగ్రఫీ వీడియోలు, న్యూడ్‌ వీడియో కాల్‌లతో మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. దేశంలో ఇలాంటి కేసులు ఏటా 3 లక్షలు దాటిపోతున్నాయంటే ఏ స్థాయిలో సైబర్‌ నేరగాళ్లు దండుకుంటున్నారో అర్థమవుతోంది. మధుకర్‌ విషయంలో అన్న సహాయం చేశాడు కాబట్టి బయటపడ్డాడు. కానీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న మిగతా టీనేజీ పిల్లల మాటేమిటి? సైబర్‌ నేరస్తుల బెదిరింపులతో ఆత్మహత్యే శరణ్యమనుకున్న ఘటనలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.  

ఒకే ఏడాదిలో 3.8 లక్షల కేసులు 
ఒక్క 2021 (కరోనా సమయం)లోనే ఈ తరహా కేసులు 3.8 లక్షలు నమోదయినట్టు కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు రాజస్తాన్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల నుంచి ఇలాంటి నెట్‌వర్క్‌ను సైబర్‌ మాఫియా నడిపిస్తోందని దర్యాప్తు విభాగాల ద్వారా బయటపడింది. 2021లో ఢిల్లీ పోలీసులు ఈ తరహా బెదిరింపులకు పాల్పడుతున్న 70 మంది ముఠాను అరెస్టు చేశారు. మరోవైపు సైబరాబాద్, హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్లలోనూ కుప్పలుతెప్పలుగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. 

పిల్లల్ని ప్రతిక్షణం గమనించాలి 
టీనేజ్‌లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ప్రతిక్షణం గమనించాలని, రాత్రి వేళల్లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఉండకుండా చూసుకోవాలని రాష్ట్ర పోలీసులు సూచిస్తున్నారు. యుక్తవయస్సులో పిల్లలు దారితప్పితే ప్రమాదమని పేర్కొంటున్నారు. చిక్కుల్లో పడినప్పుడు చెప్పుకోవడానికి జంకుతారని, అందుకే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు, పాఠశాలల్లో వేలాది మందిని సైబర్‌ వారియర్స్‌గా ఏర్పాటు చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. సైబర్‌ నేరాలు జరుగుతున్న తీరును వారు వివరిస్తున్నట్టు చెప్పారు. 

వల ఇలా.. 

  • టార్గెట్‌ చేసిన వ్యక్తికి సైబర్‌ నేరగాళ్లు ముందుగా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడతారు. అమ్మాయి పేరుతో ఫేక్‌ ఐడీ, ఫోటో నకిలీది పెట్టి ఎదుటి వ్యక్తిని బోల్తా కొట్టిస్తారు. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయగానే మెల్లిగా చాట్‌లోకి లాగుతారు. అలా మొదలైన చాటింగ్‌ కాస్తా మొబైల్‌ నంబర్లు ఇచ్చి పుచ్చుకునే వరకు వెళ్తుంది. ఆ తర్వాత వాట్సాప్‌ చాట్‌లో పర్సనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ షేర్‌ చేసుకునేలా చేస్తారు. అడల్డ్‌ కంటెంట్, న్యూడ్‌ చాట్‌ చేసుకునే వరకు తీసుకువస్తారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది.  
  • చాట్‌ కాస్త వీడియో కాల్స్‌లోకి వెళ్లగానే ఓ న్యూడ్‌ వీడియోను వాట్సాప్‌ కాల్‌లో లైవ్‌లో చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని సైతం న్యూడ్‌చాట్‌లోకి తీసుకువస్తారు. ఈ మొత్తం కాల్‌ని రికార్డు చేసి తర్వాత అదే వ్యక్తి వాట్సాప్‌కు వీడియో షేర్‌ చేస్తారు.  
  • ఇలా షేర్‌ చేసిన వీడియోతో బెదిరింపులు ప్రారంభిస్తారు. డబ్బులివ్వకపోతే యూట్యూబ్‌లో పెడతామంటారు. యువతులను బెదిరించి న్యూడ్‌ వీడియోలు తీసి అమ్ముకుంటున్నట్టుగా ప్రచారం చేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు సైబర్‌ నిపుణులు వెల్లడించారు.  
  • ఈ తరహా కాల్స్‌లో 90 శాతం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్య జరుగుతున్నవేనని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement